భువనగిరికి కేంద్రీయ విద్యాలయం

రాష్ట్రంలోని భువనగిరికి కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 50 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ హెచ్చార్డీ నిర్ణయం తీసుకుంది. వాటిలో భువనగిరికి చోటు దక్కింది. ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయించింది. 2017-18 ఏడాదికి గాను నెల రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుందని కేవీ సంఘటన్ పేర్కొన్నది. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో సెక్షన్ చొప్పున తరగతులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి వాటిని పెంచుకుంటూ వెళ్తారు.

భువనగిరికి కేంద్రీయ విద్యాలయం కేటాయించాలని గత మూడేళ్లుగా స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ కేంద్రాన్ని కోరుతున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం కేటాయించింది. భువనగిరి బంజారాహిల్స్ లోని ఎఎల్ఎన్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం కానున్నది.