భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ

వ్యవసాయ రంగంలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, బిక్కనూర్ గ్రామ పంచాయతీ కొత్త భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు.

భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఏర్పడుతుందని, దీనివల్ల యాంత్రీకరణ పెరుగుతుందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే, భారీ సబ్సిడీ యంత్ర పరికరాలను రైతులకు అందిస్తున్నామని చెప్పారు. రైతులు అప్పుల ఊబి నుండి బయటపడాలని, భవిష్యత్తులో స్వంతంగా పెట్టుబడులు పెట్టుకొని వ్యవసాయం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో రైతులు అసంఘటితంగా ఉన్నారని మంత్రి పోచారం చెప్పారు. రాష్ట్రంలోని 10,800 రెవిన్యూ గ్రామాలను 3600 యూనిట్స్ గా విభజించి వచ్చే నెల (సెప్టెంబర్) 1 నుండి 9 వరకు గ్రామ రైతు సమన్వయ సంఘాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి సమన్వయ సంఘంలో 1/3 వంతు మహిళలు ఉంటారని వెల్లడించారు. సెప్టెంబర్ 10 నుండి 14 లోగా మండల రైతు సమన్వయ సంఘాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర సమన్వయ రైతు సంఘం వద్ద రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ లో మద్దతు ధర నిర్ణయంలో రైతు సంఘాలే నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాయని వివరించారు.

రైతు సమగ్ర సర్వే ఆధారంగా గ్రామాల్లో భూములను సర్వే చేయించి పక్కాగా రికార్డులను రూపొందిస్తామని మంత్రి పోచారం వెల్లడించారు. ఈ రికార్డుల ఆధారంగా వచ్చే ఏడాది మే నెల నుండి ఎకరాకు ఒక్కో పంటకు రూ. 4000 ఇస్తామన్నారు. వ్యవసాయ రంగంలో సలహాలు, సూచనల కోసం ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించామని చెప్పారు. ప్రతి ఏఈఓ పరిధిలో రూ. 15 లక్షల ఖర్చుతో సమావేశ మందిరం నిర్మించి, అక్కడే రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతామని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.