భారీ వర్షాలకు త్రిపుర అతలాకుతలం 

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురను వరదలు ముంచెత్తాయి. త్రిపురలోని మూడు జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కకున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకస్మిక వరదలతో దాదాపు 4 వేల 500 కుటుంబాల జనం నిరాశ్రయులయ్యారు. వారందరికీ రాజధాని అగర్తలాలో ఆశ్రయం కల్పించారు. అటు హౌరానది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో హౌరానది వంతెన దగ్గర ఏర్పడ్డ లీకేజీలకు ప్రభుత్వం మరమ్మతులు చేయించింది. ఖోవాయి జిల్లాలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.

మరోవైపు నిన్న మొన్నటిదాకా వరదలతో ఇబ్బందులు పడ్డ అసోం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరదలు కొంత తగ్గుముఖం పట్టాయి. 19 జిల్లాల్లోని సుమారు 11 లక్షల మంది జనం వరదలతో ప్రభావితమయ్యారు. ఈ ఏడాది వరద బీభత్సంతో ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య 89కి చేరింది. లక్ష ఎకరాల పంటనష్టం సంభవించింది. పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం 17 వందల 52 గ్రామాల్లో ఇంకా వరదనీటిలోనే చిక్కుకొని ఉన్నాయి.

అటు నేపాల్ లో వర్స బీభత్సం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బతో కొండచరియలు విరిగిపడి 36 మంది మృతిచెందారు. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. నీరు చేరడంతో బిరాట్ నగర్ విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది.

మరోవైపు చైనాను కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. భూకంపం వచ్చి వారం రోజులు కూడా కాకముందే భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నాన్ జింగ్, హాంగ్ జూ, యాంగ్ జూ నదీ డెల్టా ప్రాంతాలు వరదలతో ప్రభావితమయ్యాయి. యూయాంగ్ కౌంటీ గ్రామంలోని జలాశయం గోడ కూలిపోవడంతో లోతట్టు గ్రామాలను భారీ వరద ముంచెత్తుతోంది. వందలాది ఇండ్లు వరదలతో కొట్టుకుపోయాయి.