భారతీయ కార్మికులకు భద్రత కల్పిస్తాం 

ఖతార్‌ విదేశాంగ మంత్రి షేక్‌ మహ్మద్‌బిన్‌ అబ్దుల్‌రెహ్మాన్‌ అల్‌-థాని రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. ప్రధాని మోడీకి ఖతార్‌ రాజు వద్ద నుంచి తెచ్చిన లేఖను సమర్పించారు. అనంతరం భారత రక్షణ సలహాదారు అజిత్‌ డోభాల్‌తో సమావేశమై భద్రతా, రక్షణ సహకార అంశాలు చర్చించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, అక్కడ పనిచేస్తున్న భారతీయుల భద్రత, ఇంధన, వాణిజ్యం, పెట్టుబడుల అంశాల్లో విస్తృత సహకారంపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు. ఖతార్‌లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం గురించి సుష్మాస్వరాజ్‌ ప్రస్తావించగా వారి భద్రతకు అల్‌-థాని హామీ ఇచ్చారు. ఖతార్‌లో 6.3 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఖతార్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న కారణంతో ఆ దేశంతో సౌదీ అరేబియా, ఈజిప్టు, యూఏఈ, బహ్రేయిన్‌ దేశాలు సంబంధాలు తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది.