బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం

దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో రూ.11,000 కోట్ల షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్) ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ గతనెలలో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. సెకండరీ మార్కెట్ నుంచి సంస్థకు చెందిన 34.375 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.320 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం మొత్తం పదకొండు వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు విప్రో వెల్లడించింది. బైబ్యాక్ తీర్మానంపై జరిగిన బ్యాలట్, ఈ-వోటింగ్‌లో పోలైన ఓట్లలో మెజారిటీ వాటాదారులు (99.68 శాతం) ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్లు స్టాక్ ఎక్సేంజ్‌లకు సంస్థ సమాచారం అందించింది. సంస్థ వద్దనున్న నగదు నిల్వలను షేర్ల తిరిగి కొనుగోలు ద్వారా వాటాదారులకు పంచనుంది. తద్వారా ఈపీఎస్ (ఎర్నింగ్ పర్ షేర్) కూడా మెరుగుపడటమేకాకుండా, ఐటీ రంగం అనిశ్చితిలో కొనసాగుతున్న నేపథ్యంలో స్టాకుల ధరకు మద్దతు లభించనుంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి విప్రో వద్దనున్న నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.5,432 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే సంస్థ రూ.31,772 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టింది. దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ ఈమధ్యే రూ.16 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. నం.2 కంపెనీ ఇన్ఫోసిస్ సైతం రూ.13,000 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.