ప్రస్తుతానికైతే పెట్రో పన్నులు తగ్గించం!

ఈమధ్యకాలంలో గణనీయంగా పెరిగిన పెట్రో ధరాభారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నులేమైనా తగ్గించబోదా అని ఆశగా ఎదురుచూసినవారిపై పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీళ్లు చల్లారు. ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులపై పునరాలోచించాల్సిన పరిస్థితులింకా రాలేదని  ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన తెలిపారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడితే ప్రభుత్వం సమీక్షిస్తుందన్నారు. జూలై నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు నెలల కాలంలో హైదరాబాద్ మార్కెట్లో లీటరు పెట్రోల్ రూ.6కు పైగానే పెరిగింది. డీజిల్ దాదాపు రూ.4 వరకు ప్రియమైంది. గతంలో ప్రతి 15 రోజులకోసారి ధరలను సవరిస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు.. ఆ సంప్రదాయానికి తెరదించుతూ జూన్ 16నుంచి రోజువారీ ధరల మార్పు విధానాన్ని ప్రవేశపెట్టాయి. మొదటి పక్షం రోజులు ధరలు క్రమంగా తగ్గినప్పటికీ.. జూలై 3 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. మూడేండ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమమయ్యాయి. కానీ, అందుకు అనుగుణంగా పెట్రో రేట్లను తగ్గించకుండా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ వచ్చింది. నవంబర్ 2014 నుంచి జనవరి 2016 మధ్యకాలంలో పలుదఫాల్లో ఎక్సైజ్ సుంకం పెట్రోల్‌పై రూ.11.77, డీజిల్‌పై రూ.13.47 పెరిగింది.