ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల‌కు ఎంతో చేయూత‌నిస్తోంద‌ని గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి  ఉద్యోగుల‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంద‌న్నారు. ఉద్యోగుల సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ‌ర్ రావు అని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సొంత ఇంటి క‌ల‌ను నిజం చేసేందుకు రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఇండ్లను వారికి ఇవ్వాల‌ని సీఎం నిర్ణయించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నిర్మించిన ఇండ్లను ఆన్ లైన్ లో విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేప‌థ్యంలో ఇవాళ స‌చివాల‌యంలో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి ఎస్పీ సింగ్ రాజీవ్ స్వగృహ వెబ్ సైట్ (www.tsswagruha.cgg.gov.in) ను ప్రారంభించారు.

రాజీవ్ స్వగృహ ఇండ్లను ఉద్యోగుల‌కు విక్రయించాల‌ని ప్రభుత్వం నిర్ణయించిన నేప‌థ్యంలో ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఎంతో వేగంగా అభివృద్ది చెందుతున్న హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో స్వంత ఇంటి క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేర‌కు ఎలాంటి లాభాలు ఆశించకుండా స‌బ్సిడీ రేట్ కు ఫ్లాట్లను విక్రయిస్తున్నామ‌న్నారు.

రాజీవ్ స్వగృహ కార్పోరేష‌న్ అన్ని మౌలిక వ‌స‌తుల‌తో కూడిన ఫ్లాట్లను నిర్మించింద‌ని, వీటిని కొనుగోలు చేయాల‌నుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. త్వర‌లోనే ఆన్ లైన్ లో ప్లాట్ల విక్రయ సేవ‌ల‌ను అందుబాటులోకి తెస్తామ‌న్నారు. ఫస్ట్ క‌మ్ ఫస్ట్ బేసిస్ మీద ప్లాట్లను విక్రయిస్తామ‌ని మంత్రి వెల్లడించారు. బండ్లగూడ‌, పోచారంలో మొత్తం 3710 ప్లాట్లను అమ్ముతున్నామ‌న్నారు. బండ్లగూడ‌లో నిర్మాణం పూర్తైన ప్లాట్ ధ‌ర చ‌ద‌ర‌పు అడుగుకు రూ.1900, సెమి ఫినిష్డ్ ప్లాట్ కు రూ.1700, పోచారంలో నిర్మాణం పూర్తైన ప్లాట్స్ చ‌ద‌ర‌పు అడుగుకు రూ. 1700 గా, సెమీ ఫినిష్డ్ వాటికి రూ.1500 గా నిర్ణయించిన‌ట్లు చెప్పారు.

రాజీవ్ స్వగృహ ఇండ్లను ప్రభుత్వ ఉద్యోగుల‌కు విక్రయించాల‌ని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవ‌డం గొప్ప విష‌య‌మ‌ని ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి ఎస్పీ సింగ్ అన్నారు. ఈ నిర్ణయం ప‌ట్ల ప్రభుత్వ ఉద్యోగులంద‌రూ ఎంతో సంతోషంగా ఉన్నార‌ని చెప్పారు.  ప్రభుత్వం అందిస్తున్న స్నేహ‌పూర్వక‌ కానుక‌గా దీన్ని సీఎ‌స్ అభివ‌ర్ణించారు. హైద‌ర‌బాద్ లాంటి మెట్రో న‌గ‌రంలో ప‌రిమిత వ‌న‌రులున్న ఉద్యోగులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని సూచించారు. గృహ నిర్మాణ శాఖ నిర్మించిన ఇండ్లను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల భ‌విష్యత్తులో కూడా ఎలాంటి వివాదాల‌కు తావుండ‌ద‌న్నారు.

ఎప్పుడో నిర్మాణాలు పూర్తైన ఫ్లాట్లు విక్రయం జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల గృహ నిర్మాణ శాఖపై భారం ప‌డింద‌న్నారు ఆ శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్రట‌రీ చిత్ర రామ‌చంద్రన్. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ వాటాగా వ‌డ్డీతో క‌లిపి రూ.1069 కోట్ల రూపాయలు రాజీవ్ స్వగృహపై భారం ప‌డిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీవ్ స్వగృహ‌పై ఉన్న అప్పులను తీర్చేందుకు ఎప్పటిక‌ప్పుడు చ‌ర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ నుంచి ఇప్పటి వ‌ర‌కు రూ.670 కోట్ల రుణాన్ని తీర్చిన‌ట్లు వివరించారు. త్వర‌లోనే మిగిలిన రూ.400 కోట్ల అప్పును తీర్చేందుకు త‌గిన చ‌ర్యలు తీసుకుంటున్నామ‌న్నారు.

రాజీవ్ స్వగృహ ఇండ్లను అతి త‌క్కువ ధ‌ర‌కు విక్రయించ‌డం ఉద్యోగుల‌కు నిజంగా వ‌రం లాంటిద‌ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ‌చ్చిన అవ‌కాశాన్ని ప్రతి ఒక్కరూ ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల స్వంత ఇంటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు కృషి చేస్తున్న‌ సీఎం కేసీఆర్ కు ధ‌న్యవాదాలు తెలిపారు టీఎన్జీవో అధ్యక్షులు కారెం రవీంద‌ర్ రెడ్డి. ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, గృహ నిర్మాణ శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్రట‌రీ చిత్ర రామ‌చంద్రన్, సెంటర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ డైరెక్టర్ రాజేంద్ర నిమ్జే, హౌజింగ్ కార్పోరేష‌న్ సీఈ స‌త్యమూర్తి, టీఎన్జీవో అధ్యక్షులు కారెం ర‌వీంద‌ర్ రెడ్డి, గెజిటెడ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ అధ్యక్షులు స‌త్యనారా‌య‌ణ‌, టీఎన్జీవో జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ రాజేందర్, సెక్రటేరియ‌ట్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ తో పాటు ఇత‌ర ఉద్యోగ సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.