పెరగనున్న లగ్జరీ కార్ల ధరలు

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో భారీగా తగ్గిన లగ్జరీ కార్ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. మధ్యస్థాయి, భారీ, లగ్జరీ కార్లతోపాటు హైబ్రిడ్ మోడళ్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌పై (ఎస్‌యూవీ) గరిష్ఠ సెస్సు పరిమితిని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచేందుకు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన ఫలితంగా బడా కార్ల ధరలు రూ.3 లక్షల వరకు తగ్గాయి. అయితే, కొత్త పరోక్ష పన్నుల విధానంలో సాధారణ వస్తువుల రేట్లు మాత్రం గతంలో కంటే పెరిగాయి. ఈ వ్యత్యాసాన్ని చక్కదిద్దేందుకే పెద్ద కార్లపై సెస్సు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠ సెస్సు పరిమితిని పెంచేందుకు ఆర్డినెన్స్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జీఎస్టీ (రాష్ర్టాలకు నష్టపరిహారం) చట్టం-2017లో తగిన సవరణ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  తెలిపారు. అయితే, ఏ విభాగ కారుపై ఎంత సెస్సు విధించాలి, పెంపును ఎప్పటినుంచి అమలు చేయాలనేది జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందని చెప్పారు. ఈనెల 9న హైదరాబాద్‌లో అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కాబోతున్నది.