పుంజుకున్న ఇన్ఫోసిస్ షేర్లు

విశాల్ సిక్కా రాజీనామా ఫలితంగా వరుసగా రెండు రోజుల్లో 15 శాతం క్షీణించిన ఇన్ఫోసిస్ స్టాకుల ధర గత మూడు సెషన్లలో మళ్లీ 4.5 శాతం మేర పుంజుకుంది. నీలేకని రీఎంట్రీతో ఈవారం సంస్థ షేర్లు మరో 8-10 శాతం మేర పుంజుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫోసిస్ షేర్ల దూకుడుతో ఈ వారం తొలి అర్ధభాగంలో మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో తీవ్ర ఊగిసలాటలకు లోనుకావచ్చని నిపుణులు అంటున్నారు. ఈ వారంలో విడుదల కాబోయే స్థూల ఆర్థిక గణాంకాలు, ఆగస్టు నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సూచీల్లో ఒడిదుడుకులు పెంచనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికపు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఈనెల 31న (గురువారం) విడుదల కానున్నాయి. గతనెలలో దేశంలోని 8 కీలక రంగాల పనితీరు డాటాను కూడా అదే రోజు ప్రకటించనున్నారు. శుక్రవారం నాడు ఉత్పత్తి రంగ పనితీరును తెలిపే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ), బ్యాంకింగ్ రంగంలో రుణ, డిపాజిట్ల వృద్ధి డాటాతోపాటు విదేశీ మారక నిల్వల వివరాలు సైతం విడుదల కానున్నాయి. అదే రోజు చాలావరకు వాహన సంస్థలు ఆగస్టు నెల విక్రయ గణాంకాలను ప్రకటించనున్నాయి. కాబట్టి వారాంతంలో ఆటో స్టాకుల్లో కదలికలు పెరుగనున్నాయి.