నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే! 

ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నందన్‌ నీలేకని గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్‌తో, భారత ప్రభుత్వంతో కలిసి పని చేసిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అంతేకాదు తనకు ఉద్యోగ అవకాశం ఇచ్చింది ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తినే అని తెలిపారు. భారతదేశ కార్పోరేట్‌ పాలనకు ఆద్యుడైన ఆయన ఓ అద్భుతమైన నాయకుడని కొనియాడారు. ఐఐటీ బాంబేలో చదువుతున్న సమయంలో పట్ని కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా మొదట ఉద్యోగ అవకాశం ఇచ్చింది నారాయణమూర్తినే అని నిలేకని చెప్పారు. అంచెలంచెలుగా ఎదిగి ఇన్ఫోసిస్‌ సీఈవోగా, వైస్‌ ఛైర్మన్‌గా పనిచేసిన అనంతరం 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆధార్‌ కార్డు సాంకేతికత విషయంలో ప్రభుత్వంతో పని చేయాలని ఆహ్వానించారని గుర్తు చేసుకున్నారు. భారత ప్రజల గుర్తింపు విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. వాటాదారులందరికీ సమాన హక్కులు కల్పిస్తానని, వారందరికీ ఒకే తరహా ప్రాధాన్యముంటుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో వస్తున్న వార్తలకు బెదరనని స్పష్టం చేశారు. వ్యవస్థాపకులు, ఉద్యోగులు ఎవరూ లేరని అందరూ ఒకటే అని అన్నారు.