నల్గొండకు నీటి విడుదల

నల్గొండలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పానగల్ ఉదయసముద్రానికి తాగునీటి అవసరాల కోసం అధికారులు నీళ్ళు విడుదల చేశారు. రోజుకు 400 క్యూసెక్కుల చొప్పున పది రోజులు నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పడున్న పరిస్థితులను బట్టి 1.05 టిఎంసీల నీటిని పానగల్ ఉదయసముద్రానికి చేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో, నల్గొండ పట్టణంతో పాటు 600 గ్రామాలకు సమృద్ధిగా త్రాగునీరు అందనున్నది.

నల్గొండ పట్టణంతో పాటు జిల్లా తాగునీటి అవసరాలకు నీళ్లు విడుదల చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం కేసీఆర్ నిన్న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమీక్షించి నీటి విడుదలకు ఆదేశించారు. దీంతో, నల్గొండ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇవాళ సాయంత్రం నీరు విడుదల చేశారు.

డెడ్ స్టోరేజ్ లోనూ నీటి విడుదలకు ఆదేశించిన సీఎం కేసీఆర్ కు ప్రజలు, మంత్రి జగదీశ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.