నగదు లావాదేవీలను తగ్గించేందుకే పెద్దనోట్ల రద్దు

దేశంలో భారీ మొత్తంలో జరుగుతున్న నగదు లావాదేవీలను తగ్గించడమే డిమానిటైజేషన్ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు 17 శాతం తగ్గాయని చెప్పారు. ఇక, ఎన్నికల్లో నల్లధనాన్ని నిరోధించడమే తమ తదుపరి లక్ష్యం అన్నారు. డిమానిటైజేషన్‌ తర్వాత డిపాజిట్‌ అయిన నోట్ల గణాంకాలపై ఆర్బీఐ విడుదల చేసిన నివేదికపై జైట్లీ మాట్లాడారు.

పెద్ద నోట్ల రద్దు లక్ష్యం డబ్బు జప్తు చేయడం కాదు… బ్లాక్‌ మనీని వెలికితీయటమేనని అరుణ్‌ జైట్లీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రత్యక్ష పన్నుల వాటా, పరోక్ష పన్నుల వాటా విస్తరించిందని చెప్పారు. కొంతమంది నోట్‌ బ్యాన్‌ ను అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. బ్లాక్‌ మనీకి వ్యతిరేకంగా యుద్ధం చేయలేని వారు, దీని లక్ష్యాన్ని గందరగోళంలో పడేశారని ఆరోపించారు.

పెద్ద నోట్ల రద్దుతో లక్షల కోట్ల నల్లధనం బయటికి వస్తుందని కేంద్రం భావించింది. గత ఏడాది నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన తర్వాత నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు డిపాజిట్ అయిన నోట్ల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. రద్దు చేసిన పెద్ద నోట్లు దాదాపు 99 శాతం డిపాజిట్ అయ్యాయని ప్రకటించింది. 15 లక్షల 44 వేల కోట్ల రూపాయలు రద్దు చేస్తే సుమారు 8,900 కోట్ల రూపాయల విలువైన వెయ్యి రూపాయల నోట్లు మాత్రమే డిపాజిట్ కాలేదని పేర్కొన్నది. దీంతో, డిఫెన్స్ లో పడిన కేంద్రం తమ చర్యను సమర్థించుకున్నది.