ధైర్యవంతుడైన యువకుడి కథ!

గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆక్సిజన్. ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. అక్టోబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. “సాహసమే ఊపిరిగా బతికే ఓ ధైర్యవంతుడైన యువకుడి కథ ఇది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. గోపీచంద్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ముంబాయి, గోవా, సిక్కింతో పాటు పలు అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. దర్శకుడు జ్యోతికృష్ణ కొత్త పంథాలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. గోపీచంద్ నటన, యువన్‌శంకర్ రాజా బాణీలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియోను విడుదల చేస్తాం” అని నిర్మాత తెలిపారు. జగపతిబాబు, కిక్‌శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యుసింగ్, అమిత్, ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.