తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టు ద్వారా ఏ ప్రాంతం నుంచి ఎన్ని నీళ్లు మిషన్ భగీరథకు ఉపయోగిస్తారో మదింపు చేయాలని, రాష్ట్రం యూనిట్ గా గుర్తించి యావత్ తెలంగాణ అవసరాలను తీర్చడం కోసం ‘డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ’ను  ఏర్పాటు చేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఏ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఎన్ని నీళ్లు కావాలో లెక్కలు వేసి, వాటి వినియోగానికి సంబంధించి ‘పవర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేయాలని కోరారు.

వ్యవసాయ భూముల రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఉన్నత స్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మండలానికో రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి, రెవెన్యూ కార్యాలయాల్లో ఐటి అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వ్యవసాయం, నీటి పారుదల, మిషన్ భగీరథ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సంయుక్త సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదుల ద్వారా అందుబాటులోకి వచ్చే జలాలను మంచినీరు, సాగునీరు, విద్యుత్, పారిశ్రామిక అవసరాల కోసం సమర్థంగా వాడుకునే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

‘‘గోదావరి, కృష్ణ నదులపై అనేక ప్రాజెక్టులు కడుతున్నాం. ఈ రెండు నదుల నీటితో రైతులకు సాగునీరు అందించడంతో పాటు మంచినీరు, పరిశ్రమలకు నీరు, విద్యుత్ ఉత్పత్తికి నీరు సరఫరా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రాజెక్టుల వారీగా కొత్త ఆపరేషన్ మాన్యువల్స్ తయారు చేయాలి. ప్రాజెక్టు నుంచి సాగునీరు ఎంతివ్వాలి? మంచినీరు ఎంతివ్వాలి? విద్యుత్ కేంద్రాలకు ఎంత నీరు ఇవ్వాలి? పరిశ్రమలకు ఎంతివ్వాలి? అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. ప్రాజెక్టుల్లో నీరు చేరిన దాన్ని బట్టి కూడా ప్రాధాన్యతలను నిర్ణయించి నీటి విడుదల జరపాలి. దీనికోసం ప్రత్యేక విధానం అమలు చేయాలి. కొత్త ఆపరేషన్ మాన్యువల్స్ వెంటనే తయారు చేయాలి” అని సీఎం కోరారు.

“నీటి విడుదలకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజధాని నుంచి వచ్చే సూచనలు, ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలి. మిషన్ భగీరథ అధికారులు కూడా ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు తీసుకుంటున్నాము? ఏఏ ప్రాంతాలకు ఎక్కడి నుంచి నీరు సరఫరా చేస్తున్నాము? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల నుంచి వాడుకునే నీటికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి వ్యవహరించేందుకు డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఫర్ తెలంగాణను నెలకొల్పాలి. ఇదే విధంగా పవర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణను కూడా ఏర్పాటు చేయాలి. వారు కూడా ఏ ప్రాజెక్టు నుంచి ఏ విద్యుత్ కేంద్రానికి ఎన్ని నీళ్లు కావాలో? అవి ఎలా పొందాలో? స్పష్టమైన అంచనాకు రావాలి. పరిశ్రమలకు కూడా ఇదే విధమైన ఏర్పాటుండాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

నీటి పారుదల, మిషన్ భగీరథ, విద్యుత్, పరిశ్రమల శాఖల అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకుని నదీ జలాల వాడకంపై అవగాహనకు రావాలని సిఎం ఆదేశించారు.

‘‘ప్రాజెక్టుల నీటిలో మంచినీటికి అధిక ప్రాధాన్యమిస్తాం. ఇందుకోసం అన్ని రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మంచినీటికి రిజర్వు చేశాం. ఆ నీటిని సమర్థంగా వాడుకోవాలి. వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందుబాటులోకి వస్తాయి. కాళేశ్వరం ద్వారా పాత వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందుతుంది. కాబట్టి మిషన్ భగీరథ అధికారులు రెండు రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడున్న నీటి లభ్యత, వనరులను బట్టి వచ్చే ఏడాది జూలై నాటికుండే పరిస్థితిని అంచనా వేసి ప్రణాళిక సిద్దం చేయాలి. కాళేశ్వరం నీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత శాశ్వత ప్రణాళిక వేసుకోవాలి. హైదరాబాద్ తో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా లెక్కలు వేసుకుని ఎన్ని నీళ్లు అవసరమో అన్ని నీళ్లు తీసుకుని మంచినీరుగా అందివ్వాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు.

హైదరాబాద్ మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారాలుగా రెండు రిజర్వాయర్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒక దాన్ని కాళేశ్వరం ద్వారా వచ్చే గోదావరి నీటితో నింపాలని, రెండో దాన్ని కృష్ణా నదీ జలాలతో నింపాలన్నారు. ప్రస్తుతమున్న హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల సామర్థ్యం చాలా తక్కువని, అవి నగర అవసరాలు తీర్చలేవని చెప్పారు. కరువు వచ్చినా, నదీ జలాలు అందుబాటులో లేకున్నా సరే, హైదరాబాద్ నగర వాసులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే త్వరితగతిన రిజర్వాయర్ల నిర్మాణం కావాలని చెప్పారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తన్నీరు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.కె. జోషి, బి.ఆర్.మీనా, ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, సీనియర్ అధికారి వాకాటి కరుణ, నీటి పారుదల ఇఎన్సీ మురళీధర్, మిషన్ భగీరథ ఇఎన్సీ సురేందర్ రెడ్డి, హెచ్ఎండబ్ల్యుఎస్ సిఇ సత్యనారాయణ, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.