డేరాబాబాకు జైలులో వీవీఐపీ సౌకర్యాలు లేవు

రేప్ కేసులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ ని కోర్ట్ దోషిగా నిర్ధారించడంతో చెలరేగిన అల్లర్లలో ఇప్పటి వరకు పంచకులలో 28 మంది మృతి చెందినట్లు గుర్తించారు. మరణించిన వారిలో స్థానికులెవరూ లేరని, మృతదేహాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని హర్యానా చీఫ్ సెక్రటరీ దీపేందర్ సింగ్ తెలిపారు. డేరాబాబా ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాలో జరిగిన గొడవల్లో ముగ్గురు మరణించారని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 250 మంది గాయపడ్డారని వివరించారు. నిన్న కోర్ట్ తీర్పు తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన గుర్మీత్ సింగ్ ను రోహ్ తక్ జైల్లో ఉంచారు. ఆయనకు ఎలాంటి వీవీఐపీ సౌకర్యాలు కల్పించడం లేదని హర్యానా సీఎస్ స్పష్టం చేశారు.

2002 నాటి రేప్ కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ సింగ్ దోషి అని పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ నిన్న తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే అతన్ని హెలికాప్టర్ లో జైలుకు తరలించింది. ఈ కేసులో గుర్మీత్ సింగ్ కు కోర్ట్ ఈ నెల 28న శిక్ష ఖరారు చేయనున్నది. దీంతో, డేరాబాబా మద్దతుదారులు పంచకుల సహా చంఢీఘడ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో హింసాత్మక చర్యలకు దిగారు.