డేరాబాబాకు ఎందుకంత ఫాలోయింగ్?

గుర్మీత్ సింగ్ రేప్ కేసులో తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో అసలు ఎవరీ డేరాబాబా అన్నది చర్చగా మారింది. డేరాబాబా మద్దతుదారుల హింసాత్మక ఘటనలతో ఆయనకున్న ఫాలోయింగ్‌ ఆసక్తి కలిగిస్తున్నది. ఎన్ని ఆరోపణలున్నా లక్షలాదిమందికి ఆరాధ్య దైవంగా ఆయన ఎలా మారారు? భూమిపై నడిచే దేవుడిగా ఎలా ఎదిగాడు?

గుర్మీత్ సింగ్‌ ను దైవంగా భావించటానికి కారణం ఆయన మానవతా కార్యక్రమాలు.  మతాలకు, కులాలకు వ్యతిరేకంగా ఆయన నడుపుతున్న డేరా సంస్థయే గుర్మీత్‌ ను పాపులర్‌ చేసింది. అసలు డేరా సచ్ఛా సౌధా సంస్థను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆ తర్వాత ఈ సంస్థను గుర్మీత్ సింగ్ నిర్వహిస్తున్నారు. డేరాలు అనే సంస్కృతి మధ్య యుగం నాటి నుంచే ఉంది. సమాజంలో వివక్షకు గురైన అట్టడుగు వర్గాల ప్రజలకు మేలు చేసే సంస్థే డేరా సచ్ఛా సౌదా. గుర్మీత్‌ సింగ్ బాబా ఈ సంస్థను నిర్వహిస్తున్నప్పటి నుంచి భారీ ఎత్తున అట్టడుగు వర్గాల ప్రజలు ఇందులో చేరారు. బాబా ప్రసంగాలకు లక్షలాది మంది ఆకర్షితులయ్యారు.

డేరా సంస్థలో ఉండే సంప్రదాయంలో ఎలాంటి కులాల అడ్డుగోడలుండవు. దీంతో ఎంతో మంది అట్టడుగు వర్గాల వారు ఇందులో చేరారు. వీరంతా ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఏ మతాన్ని ఆచరించకుండా ప్రత్యేకంగా ప్రార్థనల కోసం నామ్‌ చర్చా ఘర్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీమంతుడైనా, బీదవాడైనా వారిని ఒకే విధంగా పరిగణిస్తారు. పైగా పంజాబ్‌, హరియాణాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో దీనికి వ్యతిరేకంగా డేరా సచ్ఛా సౌదాలో లక్షలాది మంది దళితులు చేరారు. ఇదే సందర్భంలో గుర్మీత్‌ సింగ్ బోధనలకు వారు ప్రభావితమై, ఆయనను దేవునిగా భావిస్తున్నారు.

డేరా సచ్ఛా సౌదాను యూనిట్లుగా విభిజించి ప్రజలకు సేవ చేస్తున్నారు గుర్మీత్ సింగ్.  ప్రతి యూనిట్‌ కు భంగీదాస్‌ అనే హోదా ఉన్న వ్యక్తి బాధ్యుడిగా వ్యవహరిస్తారు. సభ్యుల ఇబ్బందులను తెలుసుకొని కేంద్ర కార్యాలయమైన సిర్సాకు తెలియచేయడం వీరి ప్రధాన విధి. అనారోగ్యంగా ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పెద్ద ఆసుపత్రి ఉంది. ఇక డేరాలో సభ్యులకు సబ్సిడీతో కూడిన ఆహారధాన్యాలను సరఫరా చేస్తారు. ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా అందించే వాటికన్నా ఇవి ఎంతో నాణ్యంగా ఉంటాయి. ఇక్కడ ఎలాంటి అవినీతి కనిపించదు. వీటికి తోడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవి డేరాలో చేరిన ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి.

గత కొన్ని ఏళ్లుగా ఈ కార్యక్రమాలు జరుగుతుండటంతో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో గుర్మీత్ సింగ్‌ కు జనాల్లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. రెండు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ఆయన డిసైడింగ్ ఫ్యాక్టర్‌ గా మారిపోయారు.