డిసెంబర్ నాటికి ఉదయ సముద్రం పూర్తి చేయాలి

ఉదయసముద్రం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులలోనూ ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 24 గంటలు పని చేస్తేనే ఉదయసముద్రం పూర్తవుతుందన్నారు. ఉదయసముద్రం పనులను హైదరాబాద్ లోని జలసౌధలో ఆయన సమీక్షించారు.

ఉదయసముద్రం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి హరీశ్ రావు కోరారు. స్పెషల్ డ్రైవ్ చేస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని, 60 చెరువులను నింపాలని అధికారులను ఆదేశించారు. టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఇంజనీర్లను, ఏజెన్సీలను కోరారు.

డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకల రిజర్వాయర్ లకు చెందిన భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిని కూడా మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. డిండికి మొత్తం 9,800 ఎకరాలు అవసరం కాగా 5,000 ఎకరాలు సేకరించినట్టు అధికారులు తెలిపారు. రెండు వారాల్లో మిగతా భూసేకరణ ప్రక్రియ ను పూర్తి చేయాలని మంత్రి కోరారు. పెండ్లిపాకల రిజర్వాయర్ నిర్మాణంలో పెండింగులో ఉన్న భూసేకరణకు గాను సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. భూసేకరణ వేగవంతం కోసం ఇరిగేషన్ జేఈ ఒకరికి బాధ్యతలు ఇవ్వాలని చెప్పారు.

ప్రతి వారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమావేశాల్లో పాల్గొనాలని మంత్రి హరీశ్ రావు  ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు. అవసరమైనంత మేరకే భూసేకరణ జరపాలని, పక్కా ప్రణాళికతో భూములు సేకరించాలని స్పష్టం చేశారు. కాలువల కోసం అవసరానికి మించి భూసేకరణ జరుగుతున్నట్టు మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల భూసేకరణ, డిజైన్లు, తదితర పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఈ సునీల్ ను ఆదేశించారు.

నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఖమ్మం జిల్లాలో పూర్తయిన 19 లిఫ్ట్ పథకాల పరిస్థితిని సమీక్షించి లక్ష ఎకరాలకు సాగునీరు అందేలా చూడాలని కోరారు. గత యేడాది ఎస్.ఆర్.ఎస్.పి పరిధిలో టెయిల్ టు హెడ్ విధానం సక్సెస్ అయినందున అదే పద్ధతిలో ఎన్.ఎస్.పి. కింద కూడా టెయిల్ టు హెడ్ ప్రయోగం అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలోనూ అమలు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, ఈఎన్సీ(అడ్మిన్) నాగేందర్ రావు,
సీఈ సీడీఓ నరేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సీఈ ఎస్.సునీల్ పాల్గొన్నారు.