టెక్సాస్, లూసియానాల్లో తుఫాన్ బీభత్సం

అమెరికాలోని టెక్సాస్ లో హర్వే తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. తుఫాన్ కారణంగా భారత్ కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. రాజస్థాన్ కు చెందిన నిఖిల్ భాటియా వరద నీటిలో మునిగి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో హర్వే తుఫాన్ ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 15కి చేరింది. టెక్సాస్ తో పాటు లూసియానాలో కూడా తుఫాన్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక సిబ్బంది. రహదారులు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో టెక్సాస్ లో పలుచోట్ల మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హ్యూస్టన్ లో రెండు డ్యాంల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.