జీహెచ్ఎంసీలో సరికొత్త చరిత్ర

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో రికార్డు స్థాయిలో 8,225 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ల‌క్ష డ‌బుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్ర‌ధాన అంకం నేడు పూర్తి అయింది. మొత్తం ల‌క్ష డ‌బుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాల‌కు టెండ‌ర్లను పిలిచింది. నేడు 31,704 ఇళ్ల‌కు టెండ‌ర్ల‌ను పిల‌వ‌డం ద్వారా మొత్తం ల‌క్ష ఇళ్ల‌కు టెండ‌ర్లు పిలిచి నూతన అధ్యాయానికి నాంది పలికింది.

ల‌క్ష ఇళ్ల‌లో ఇళ్లు ప్ర‌స్తుతం ఉన్న 33 బ‌స్తీల‌ను ఖాళీ చేయించి తిరిగి కొత్త ఇళ్ల‌ను నిర్మించ‌డం కూడా ఒక రికార్డుగా చెప్పుకోవ‌చ్చు. కేవ‌లం అతిత‌క్కువ వ్య‌వ‌ధిలోనే ల‌క్ష ఇళ్ల‌కు టెండ‌ర్లు పిల‌వ‌డం కూడా ఒక ప్ర‌త్యేక‌త‌. ప్ర‌ధానంగా ప్ర‌స్తుతం నివాసం ఉంటున్న బ‌స్తీల నుండి నివాసితుల‌ను ఖాళీ చేయించి అక్క‌డ ఉన్న పాత ఇళ్ల‌ను తొల‌గించి తిరిగి కొత్త ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డం స‌వాలుతో కూడుకున్న‌ది. మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ ల ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మొత్తం 33 బ‌స్తీల‌కు చెందిన నివాసితుల‌ను ఖాళీ చేయించి డ‌బుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డంలో విజ‌య‌వంత‌మ‌య్యారు.

ఈ బ‌స్తీల్లో కొంద‌రికి 30 గ‌జాలు, మ‌రికొంద‌రికి 150 గ‌జాల వ‌ర‌కు స్థ‌లం ఉన్న‌వారు ఉన్నారు. ఎక్కువ స్థ‌లం ఉన్న‌వారు డ‌బుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల‌కు నిరాక‌రించ‌డం, కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించ‌డం, డ‌బుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణాల‌కు తీవ్ర ఆటంకాలు సృష్టించారు. ప్ర‌త్యేకంగా స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను నియ‌మించి వీరంద‌రిని డ‌బుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణాల‌కు ఒప్పించ‌డంలో జీహెచ్ఎంసీ విజ‌య‌వంతమైంది.

ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో కేవ‌లం ఒక ఐడీహెచ్ కాల‌నీని ఖాళీ చేయించి దీనిలో డ‌బుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల‌ను మాత్ర‌మే నిర్మించింది. తిరిగి మ‌రో 33 ప్రాంతాల్లో డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల‌ను నిర్మించ‌డం ద్వారా నివాసితుల‌కు విశాల‌మైన త‌గు మౌలిక స‌దుపాయాలు, పార్కింగ్ ఇత‌ర సౌక‌ర్యాలు క‌లిగిన ఇల్లు ల‌భించ‌డంతో పాటు మురికివాడ ర‌హిత న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌న్న ప్ర‌భుత్వ సంక‌ల్పం కూడా నెర‌వేర‌డానికి మార్గం సుగ‌మ‌మైంది.

ల‌క్ష ఇళ్ల నిర్మాణానికి 109 ప్రాంతాల్లో కావాల్సిన భూమిని జీహెచ్ఎంసికి బ‌ద‌లాయించ‌డానికి హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, సంగారెడ్డి జిల్లాల క‌లెక్ట‌ర్లు, భూముల విష‌యాన్ని ప‌ర్య‌వేక్షించే జాయింట్ క‌లెక్ట‌ర్లు, డిఆర్ఓల‌తో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జనార్దనరెడ్డి నిరంత‌రం స‌మీక్షించారు. వివిధ శాఖ‌లతో ప్ర‌తి నెల నిర్వ‌హించే సిటీ క‌న్వ‌ర్జెన్స్ స‌మావేశంలో మొద‌టి ఎజెండాగా డ‌బుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ అంశాన్ని చేప‌ట్టేవారు.

హైదరాబాద్ బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీ‌లో రాష్ట్ర ప్రభుత్వం 396 డ‌బుల్ బెడ్‌ రూం ఇళ్ల‌ను నిర్మించ‌డంతో మొత్తం దేశ‌మే ఆశ్చ‌ర్య‌పోయింది. ఢిల్లీలో ఐఏఎస్ ల క్వార్ట‌ర్ల క‌న్నా ఐడీహెచ్‌ కాల‌నీ ఇళ్లు బాగున్నాయ‌ని స్వ‌యంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంసించ‌డం, ఇప్ప‌టికీ ప్ర‌తి నెలా ఏదో ఒక ప్రాంతం, రాష్ట్రం నుండి ప్ర‌తినిధి బృందం ఈ కాల‌నీని సంద‌ర్శించ‌డంతో ఇది ఒక ప‌ర్యాట‌క స్థ‌లంగా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు నగరంలోని 88 ప్రాంతాల్లో 59,520 డ‌బుల్ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాల‌కు టెండ‌ర్లు పూర్తి కా‌గా, వీటిలో 40 లొకేష‌న్ల‌లో 27,734 డ‌బుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. నేడు 2,725 కోట్ల రూపాయ‌ల వ్య‌యం కాగ‌ల 31,704 ఇళ్ల‌కు టెండ‌ర్లు పిలవటంతో మొత్తం ల‌క్ష్యంగా ఉన్న ల‌క్ష ఇళ్ల‌కు టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తి అయింది.

దీపావ‌ళి పండుగ నుండి ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తై ద‌శ‌ల‌వారిగా గృహ‌ప్ర‌వేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌ధానంగా నాచారంలోని సింగంచెరువు తండాలో నిర్మిస్తున్న 196 డ‌బుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు పూర్తి కానున్నాయి. దీని అనంత‌రం మ‌న్సూరాబాద్ ఎరుక‌ల నాంచార‌మ్మ బ‌స్తీలో నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు కూడా పూర్తవుతాయి.

560 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో రెండు గ‌దులు, రెండు టాయిలెట్లు, కిచెన్‌, హాల్‌ తో నిరుపేద‌ల‌కు ఉచితంగా నిర్మించి ఇవ్వ‌డం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌రిత్ర సృష్టించింది. డ‌బుల్ బెడ్‌ రూం ఇళ్ల ప‌థ‌కం విజ‌య‌వంతం కాద‌న్న వారికి ఇళ్లు నిర్మించి ఇస్తుండటంతో వారి అంచ‌నాలు త‌ల‌క్రిందులు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది అంత‌స్తులు, ఐదు అంత‌స్తులు, మూడు అంత‌స్తుల్లో ఈ డ‌బుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. రాష్ట్రంలో చేప‌ట్టిన ఈ డ‌బుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణ ప‌థ‌కాన్ని కేర‌ళ‌,  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ త‌దిత‌ర రాష్ట్రాలు చేప‌ట్టడం గర్వించదగ్గ విషయం.