జియో యాప్ @ 10 కోట్ల డౌన్‌లోడ్లు

గూగుల్ ప్లే స్టోర్‌లో రిలయన్స్ జియోకు చెందిన మొబైల్ అప్లికేషన్ మై జియో డౌన్‌లోడ్లు 10 కోట్లకు చేరుకున్నాయి. దాంతో మైజియో యాప్.. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై అత్యధిక మంది డౌన్‌లోడ్ చేసుకున్న ఇండియన్ మొబైల్ అప్లికేషన్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుందని సంస్థ తెలిపింది. హాట్‌స్టార్ మొదటి స్థానంలో ఉంది. కేవలం ఏడాది కాలంలోనే మై జియో ఈ ఘనతను దక్కించుకుంది. ఇతర టెలికం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌కు చెందిన సెల్ఫ్‌కేర్ యాప్‌ల డౌన్‌లోడ్‌లు మాత్రం ఇప్పటివరకైతే కోటి మైలురాయిని దాటగలిగాయి. రిలయన్స్ జియోకు చెందిన లైవ్ టీవీ యాప్ జియో టీవీ డౌన్‌లోడ్లు 5 కోట్ల స్థాయికి చేరుకున్నాయి. ఎయిర్‌టెల్ టీవీ యాప్ డౌన్‌లోడ్లు 50 లక్షలు దాటగా.. వొడాఫోన్, ఐడియాలకు చెందిన టీవీ యాప్‌ల డౌన్‌లోడ్లు పది లక్షల మార్క్‌ను దాటాయి.