చేపపిల్లల పంపిణీ ప్రారంభించిన తలసాని

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత చేపపిల్లల పంపిణీ మొదలైంది. సంగారెడ్డి జిల్లా సింగూరులో మంత్రి తలసాని చేపపిల్లలను వదిలి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబూమోహన్‌ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి తలసాని మాట్లాడారు.

కులవృత్తులపై ఆధారపడిన వారు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగానే మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఈసారి 70 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మత్స్య సహకార సంఘాలను పటిష్టం చేయడానికి త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చేపల మార్కెటింగ్‌ కోసం సబ్సిడీపై వాహనాలు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రూ. 5 వేల కోట్ల ఖర్చుతో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించినట్లు తెలిపిన తలసాని..  ఇప్పటి వరకు రాష్ట్రంలో 17లక్షల 50వేలకు పైగా గొర్రెలను పంపిణీ చేసినట్లు చెప్పారు. త్వరలో 100 సంచార పశు వైద్యశాల వాహనాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్దిని మూడేళ్లలో చేసి చూపించినట్లు తలసాని తెలిపారు.