క్షీణించిన బీవోబీ లాభం

ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాలకు కేటాయింపుల సెగ తగిలింది. గడిచిన త్రైమాసికానికిగాను రూ.203.39 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ ప్రకటించింది. 2016-17 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.423.62 కోట్ల లాభంతో పోలిస్తే 52 శాతం క్షీణించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి అధికంగా నిధులు కేటాయించడం వల్లనే లాభాల్లో గండిపడిందని బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలానికి బ్యాంక్ రూ.12,103.86 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జూన్ 2016 నాటికి రూ.42,991 కోట్లుగా ఉన్న బ్యాంక్ మొండి బకాయిలు గడిచిన త్రైమాసికానికిగాను రూ.46,172.77 కోట్లకు పెరిగాయి. శాతాల వారీగా చూస్తే 11.40 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్‌పీఏ రూ.20,783.77 కోట్ల(5.73 శాతం) నుంచి రూ.19,519.31 కోట్లకు(5.17 శాతం) తగ్గాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.2,156.69 కోట్ల స్థాయిలో నిధులను కేటాయించింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బ్యాంక్ షేరు ధర 3.91 శాతం పతనం చెంది రూ.142.55 వద్ద స్థిరపడింది.