కాంగ్రెస్ నేతలకు ఇకనైనా కనువిప్పు కలగాలి

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణకు, ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణానికి గాను ప్రజలు ప్రభుత్వ పక్షాన ఉన్నట్టు ప్రజాభిప్రాయ సేకరణలో తేట తెల్లమైందని మంత్రి చెప్పారు.

తెలంగాణ రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, తాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారని హరీశ్ రావు తెలిపారు. ప్రజా క్షేత్రం వదిలిపెట్టి గ్రీన్ ట్రిబ్యునళ్లు, కోర్టుల చుట్టూ తిరగడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సలహా ఇచ్చారు.

ప్రజాభిప్రాయ సేకరణ కోసం మునుపెన్నడూ లేని విధంగా స్వేచ్ఛాయుత వాతావరణం ప్రభుత్వం కల్పించిందని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. గతంలో పోలవరం వంటి ప్రాజెక్టుల పబ్లిక్ హియరింగ్ సందర్భంగా పలు అవాంఛనీయ ఘటనలు జరిగాయని, పోలీసుల పహరాలో పబ్లిక్ హియరింగ్ ను తూ తూ మంత్రంగా జరిపారని మంత్రి గుర్తుచేశారు. మొట్ట మొదటిసారి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా అందరి అభిప్రాయాలు నమోదు చేసిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలైన 15 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా, ప్రశాంతంగా ముగిసిందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. నల్లగొండ, సంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, మెదక్, కరీంనగర్, యాదాద్రి, మేడ్చల్, నిజామాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ప్రజలు స్వేచ్ఛగా, విస్తృతంగా పబ్లిక్ హియరింగ్ లో పాల్గొనే అవకాశం కలిగిందని చెప్పారు. సిద్దిపేటలో అత్యధికంగా 106 మంది తమ అభిప్రాయాలను తెలిపారని హరీశ్ రావు వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తీరాల్సిందేనని ప్రజలు, రైతులు, ఇతర కులవృత్తులవారు, యాదవులు, గంగపుత్రులు, గీత కార్మికులు, రిటైర్డు ఇంజనీర్లు గట్టిగా సమర్ధించారని మంత్రి చెప్పారు. ఆయా వర్గాల ప్రజలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు 30 వేల మందికి పైగా పాల్గొన్నారని, 1000 మందికి పైగా స్వేచ్ఛగా తమ అభిప్రాయం వెల్లడించినట్టు హరీశ్ రావు వివరించారు.

ఇకనైనా ప్రధాన ప్రతిపక్షం చౌకబారు ప్రచారం కోసం ఆరాటపడవద్దని మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. ఎన్నికల సమయంలో తప్ప ఇతర సమయాల్లో రాజకీయాలు చేయవద్దని సీఎం కేసీఆర్ పదే పదే ప్రతిపక్షాలను కోరే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులకు సహకరించాలని మంత్రి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.