కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉండే రెవెన్యూ అధికారులు.. తమ ప్రాథమిక విధి అయిన భూముల నిర్వహణను నిర్లక్ష్యం చేయాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్  అభిప్రాయపడ్డారు. భూ రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల… అనేక వివాదాలు, గందరగోళం, ఘర్షణలకు దారి తీసిందని చెప్పారు. అందువల్లనే రాష్ట్ర వ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించామన్నారు. వచ్చే మూడు నెలల పాటు కలెక్టర్లు, జాయింట్  కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు ఇదే పని మీద ఉండాలని సీఎం కేసీఆర్  ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన, సరళీకరణ, నవీకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.  హైదరాబాద్  ప్రగతిభవన్  లో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్  అలీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్  రెడ్డి, మిషన్  భగీరథ వైస్  చైర్మన్  వేముల ప్రశాంత్  రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.