ఒక్క రైతుక్కూడ హాని జరక్కుండా ప్రక్షాళన

ఏ రైతుకు కూడా ఎలాంటి హాని జరుగకుండా అంతా పూర్తి పారదర్శకంగా భూ రికార్డుల ప్రక్షాళనం జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లెక్కలన్ని సవరించిన తరువాత  రైతుల భూముల వివరాలకు సంబంధించిన తుది జాబితాపై గ్రామంలోని రైతులందరి సంతకాలు తీసుకొని బహిర్గతం చేయాలన్నారు. భూమి రికార్డుల సమగ్ర ప్రక్షాళన ఆసాంతం సులభంగా, సరళంగా, పారదర్శకంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో జరగాలని, ప్రక్షాళనలో భాగంగా తొలుత ఏ విధమైన చిక్కులు, సమస్యలు లేని సుమారు 95 శాతానికి సంబంధించి వివరాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. భూరికార్డుల సరళీకరణ, ప్రక్షాళనకు సంబంధించి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ రెవిన్యూ అధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా భూ రికార్డుల ప్రక్షాళన ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ వివరించారు.

ఒకప్పుడు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా భూమి శిస్తు వుండేది. అయితే, కాలక్రమేణా రైతుల దగ్గర శిస్తు వసూలుకు బదులు ప్రభుత్వమే ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సమకూరుస్తున్నది. దీంతో పూర్తిగా భూమికి సంబంధించిన దృక్పథమే మారిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా రైతులను అన్ని దేశాలు గౌరవిస్తున్నాయి. ఆహార రంగంలో స్వావలంబన వుండాలని ఏ దేశమైనా ఆలోచించడమే దీనికి ప్రధాన కారణం. మన దేశం కూడా అంతే. మన రాష్ట్రం కూడా వ్యవసాయిక ప్రధాన ప్రాంతమే కాకుండా, ఇక్కడ సమశీతోష్ణ వాతావరణం వుండటం వల్ల పంటలు బాగా పండుతాయి.

రాబోయే సంవత్సరం నుంచి కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు పుష్కలంగా లభ్యం అవుతాయి. చెరువులు నింపుకుంటాం. దీని ద్వారా పూర్వపు ఏడు జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు ఉపయోగంలోకి వస్తాయి. పంటలు బాగా పండటంతో అన్ని రకాల ప్రజలు, రైతులు బాగుంటారు.

పహాణి, సేత్వారీ లాంటి పాతకాలపు పదాలు మన తెలుగు భాషకు సంబంధించినవి కావు. అందుకే తెలుగులో సరళంగా, సులభంగా, సరళీకృతమైన భాషలో ఈ పదాలను మార్చాలి. అదే విధంగా అనేక రకాలైన లెక్కలు కూడా అనవసరం. పహాణిలో కూడా  ఎక్కువ కాలమ్స్ అవసరం లేదు. సులభంగా, కష్టతరం కాకుండా వుండాలి.

భూరికార్డుల ప్రక్షాళన ఈ నేపథ్యంలో జరుగుతున్నది. దీని కొరకు 1193 బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క బృందానికి 9 గ్రామాలు కేటాయిస్తున్నాం. మొత్తం భూరికార్డుల ప్రక్షాళన, సవరణ చేయటానికి మూడు నెలల వ్యవధి పడుతుంది. మనకున్న 31 మంది జిల్లా కలెక్టర్లకు ఏ ఏ గ్రామాలు, ఏ ఏ టీములకు కేటాయించాలో నిర్ణయించుకునే అధికారం వుంటుంది.

ఇది ప్రధానంగా భూరికార్డుల ప్రక్షాళన. ఇందులో భాగంగా రికార్డుల్లో వుండే చిత్రవిచిత్రమైన చిక్కులు, వివాదాలు తలెత్తే అంశాలన్నీ పోవాలి. రికార్డుల్లో వున్న అస్తవ్యస్త లెక్కలు చిక్కులకు, వివాదాలకు దారి తీస్తున్నాయి. బై నంబర్ల గోల్ మాల్ లేకుండా పోవాలి. రైతుకు న్యాయపరమైన చిక్కులు పూర్తిగా పోయి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోవాలి.

కోట్లాది బ్యాంకు ఖాతాలను పకడ్బందీగా నిర్వహిస్తున్న ‘‘కోర్ బ్యాంకింగ్’’ విధానాన్ని భూ రికార్డులకు అనుసరించాలి. భూ రికార్డుల ప్రక్షాళన జరిగిన తరువాత కోర్ బ్యాంకింగ్ తరహాలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా కంప్యూటర్ లో నిక్షిప్తం చేయాలి. దీని కొరకు 1000 మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులను, ప్రత్యేకించి రెవిన్యూ శాఖలో పనిచేయటానికి నియమించాలి. ఆన్ లైన్ లో ఎటువంటి సమాచారమైనా పట్టాదారులకు లభ్యం అయ్యే విధంగా రికార్డుల్లో వుండాలి.

భూ ప్రక్షాళన ఒకవైపు జరుగుతుండగా అది పూర్తయ్యేసరికి ఐటి ఆఫీసర్ల నియామకం, కంప్యూటర్లు, సర్వర్ల కొనుగోలు, కంప్యూటర్ అనుసంధానం పూర్తి కావాలి.

మ్యుటేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఎప్పటికప్పుడు జరిగిపోవాలి. రైతులు తమ క్రయవిక్రయాల కొరకు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు ఒకే ఒక్కసారి వెళ్లే వెసులుబాటు వుండాలి. ఆ తరువాత వారి పాస్ బుక్కులు కొరియర్ ద్వారా రైతుల ఇంటికే రావాలి.

ఒక్క కలెక్టర్ కోర్టు మినహా మిగతా ఇతర రెవెన్యూ కోర్టులన్నీ రద్దు చేయాలి.

బ్యాంకుల్లో రైతుల పాస్ బుక్కులు కుదువ పెట్టించుకునే విధానం పోవాలి. కంప్యూటర్ ఆధారిత సమాచారం ఆధారంగా రైతులకు రుణాలు మంజూరు చేయాలి.

భూమి, భూ సంబంధమైన వ్యవహారాలు రాజ్యాంగ పరంగా రాష్ట్ర పరిధిలో వుంటాయి. దానికి సంబంధించిన చర్యలు చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కాబట్టి దీనికి అనుగుణంగా న్యాయపరమైన చిక్కులకు ఆస్కారం లేని విధంగా రికార్డుల ప్రక్షాళన జరగాలి.

భూ ప్రక్షాళన, రికార్డుల సవరణకు సంబంధించి పకడ్బందీగా త్వరితగతిన పని పూర్తి చేసే ఎంఆర్ఓ, ఆర్డీఓ అధికారులకు, జిల్లాకు ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్లు ఇవ్వాలి.

రేపు (ఆగస్ట్ 31న) కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇతర రెవిన్యూ సంబంధిత అధికారుల సమావేశం తరువాత త్వరలోనే రాష్ట్రంలోని ఎంఆర్ఓలందరితో (తహశిల్దార్లు) సమావేశం ఏర్పాటు చేయాలి.

ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఐటి-మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోలీస్ గృహనిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సిఎంఒ అధికారులు, భూరికార్డుల ప్రక్షాళన ప్రత్యేక అధికారి కరుణ, కలెక్టర్లు రఘునందన్ రావు, వెంకట్రామ్ రెడ్డి, తదితర రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.