ఎగ్జిబిషన్ గ్రౌండ్ పై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి

ఎగ్జిబిషన్ సొసైటీకి హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లీజుని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థిక మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ఖండించారు. లీజు రద్దు చేశారంటూ కొంతమంది గిట్టనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వాటిని నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని,  వాటిని కాపాడడానికి కృషి చేస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆదరణ చూరగొన్న సంస్థలు, వ్యక్తులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే నుమాయిష్ కి ముఖ్యమంత్రి మద్దతు తెలిపారని చెప్పారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ 76 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతి ఏడాది హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కు ప్రజలు పెద్దఎత్తున హాజరవుతున్నారని మంత్రి రాజేందర్ అన్నారు.

అంతేకాకుండా 18 విద్యాసంస్థలను కూడా ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తోందన్నారు. వనిత మహా విద్యాలయ, కస్తూర్భా గాంధీ మహిళా కళాశాల, కమల నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీ లాంటివి 50 సంవత్సరాలు పూర్తిచేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాయని మంత్రి ఈటెల వివరించారు. తెలంగాణలో పేద విద్యార్థులకు విద్యను అందించడానికి, ప్రత్యేకంగా మహిళలకు విద్య అందించడానికి ఈ సొసైటీ కృషి చేస్తోందన్నారు.

తెలంగాణ వచ్చిన తరువాత మొదటి సంవత్సరం నుమాయిష్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ని సొసైటీకి 99 సంవత్సరాల లీజుకు ఇస్తామని ప్రకటించారని మంత్రి ఈటెల గుర్తుచేశారు. మీరు అడుక్కునేలాగా ఉండవద్దు అని సొసైటీని ఉద్దేశించి అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేసే సంస్థలను పెంచే ప్రయత్నం చేస్తారు కానీ తుంచే ప్రయత్నం చేయరని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ సొసైటీకి భూమిని లీజుకి కేటాయించే పనిలో ప్రభుత్వ శాఖలు ఉన్నాయని వెల్లడించారు.