ఉరకలు పెడుతున్న కృష్ణమ్మ

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరుకలెత్తుతున్నది. ఆల్మట్టికి వరదనీరు పెరగడంతో పవర్ హౌస్ ద్వారా 31వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా నదిపై నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు 40వేల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో జూరాలకు వరద ప్రవహం పెరిగింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 10వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు అవుతున్నది. రెండు రోజుల్లో ఇన్ ఫ్లో  పేరిగే అవకాశం ఉన్నదని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో పెరుగడంతో దీనికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల పథకాలు, కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ఉజ్జయిని ప్రాజెక్టులోకి 53వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరిగింది.

మహారాష్ట్రలోని మహాబలేశ్వరం, ముంబై తదితర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో జలశయాలకు వరద మొదలైంది.ఆల్మట్టికి మరో రెండు మూడు రోజుల్లో దాదాపు లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో రానున్నదని కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు.దీంతో జలాశయం నుంచి నీటిని పవర్ హౌస్ ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ వరద ఇంకా నారాయణపూర్ ప్రాజెక్టుకు చేరాల్సి ఉంది. ఆల్మట్టి నుంచి బుధవారం ఉదయం వరకు 20వేల క్యూసెక్కుల ఉండగా సాయంత్రానికి 31వేలకు పెంచారు. ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి కూడ స్పీల్ వే గేట్లను ఎత్తి బుధవారం సాయంత్రానికి 40వేల క్యాసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 53,461 క్యూసెక్కులు వస్తున్నది. ప్రవహం మరో వారం కొనసాగే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు.

అటు కృష్ణానది జన్మస్థలమైన మహాబలేశ్వరంలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు 36సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అంచనా వేసారు.అక్కడి నుంచి ఈ రెండు రోజుల్లో దాదాపు లక్ష క్యూసెక్కులు దిగువకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.ఈ నీటితో జూరాల పూర్తిగా నిండి దిగువకు వదిలితే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో పెరగనున్నది. కాగా ప్రస్తుతం ఉజ్జయినీ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు భీమా ద్వారా తంగిడి వద్ద కృష్ణాలో కలుస్తున్నది. అటు కర్ణాటకలోని హోస్పేటలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరిగింది. రెండు, మూడు రోజుల కిందటి వరకు ఎడువేల క్యూసెక్కులు ఉండగా బుధవారం సాయంత్రానికి 25వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. తుంగభద్రకు కూడ వరద పెరగుతుండటంతో జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల్లో సంబురం నెలకొంది.

అటు గోదావరి, మంజీరపై నిర్మించిన ప్రాజెక్టులు కూడ జలకళను సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి 38,864 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 90.313 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి 34.401టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది.