అద్భుత విద్యా కేంద్రంగా సిద్దిపేట డిగ్రీ కాలేజ్         

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సిద్ధిపేట డిగ్రీ కళాశాలకు ప్రత్యేక స్థానం ఉంది. సీఎం కేసీఆర్ తోపాటు ఇంకా అనేకమంది నాయకులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ  కాలేజీలోనే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. దేశ విదేశాల్లో వివిధ రంగాలలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనేక ఉద్యమాలకు ఈ  కాలేజీ ఇచ్చిన చైతన్యం ఎంతో గొప్పది.

గతంలో సిద్దిపేట ప్రాంతంలో  పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు కూడా లేని దుస్థితి. ఉపాధికి చదువొక్కటే మార్గం. డిగ్రీ చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండేది. దీంతో కాలేజీ లేక ఎంతోమంది విద్యార్థులు చదువులు మానేసిన దుస్థితి. డిగ్రీ చదవాలంటే హైదరాబాద్ కు వెళ్లి వ్యయ, ప్రయాసలకు కోర్చాల్సిందే. ఈ నేపథ్యంలో నాటి సిద్ధిపేట శాసన సభ్యుడు గురువారెడ్డి, అప్పటి ప్రముఖ నాయకుడు PV రాజేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఇక్కడ కళాశాల ఏర్పాటైంది. 1956 లో ఒక చిన్న రేకుల షెడ్ లో 30 మంది విద్యార్థులతో సిద్దిపేట డిగ్రీ కాలేజీ ప్రారంభమైంది.

కాలేజీ ఏర్పాటు తరువాత సిద్దిపేట సామాజిక పరిస్థితిలోనే గొప్ప మార్పు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. సిద్ధిపేటకు 60 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాల విద్యార్థులకు, ఈ కళాశాల వరప్రదాయినిగా మారింది. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య,  కేవీ రాఘవాచార్యులుతో పాటు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కళాశాలలో  అధ్యాపకులుగా పనిచేసి ఎంతో మంది  విద్యార్థులను గొప్పగా  తీర్చిదిద్దారు. అందుకే సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదవడం ఇక్కడి యువత గర్వకారణంగా భావిస్తారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ , 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు సిద్ధిపేట మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్,  ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తో పాటు ప్రస్తుత తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రముఖ కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ ఇంకా అనేక మంది ప్రముఖులు చదవింది ఈ కాలేజీలోనే కావడం విశేషం. ఈ కళాశాలలో చదువుకున్న ఎంతోమంది ప్రస్తుతం ఉన్నత పదవుల్లో పనిచేస్తున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో 80శాతం మంది ఈ డిగ్రీ కళాశాల విద్యార్థులే. 1969 ఉద్యమంలోనూ.. అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమంలోనూ ఈ కళాశాల విద్యార్థులు, కవులు, కళాకారులు, రచయితలు కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ 1985 లో సిద్ధిపేట MLA గా ఎన్నికైనప్పటి నుంచి కాలేజీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఇంటర్, డిగ్రీలో అనేక కొత్త కోర్సులను మంజూరు చేయించడంతో గొప్ప మార్పు వచ్చింది. పీజీ సెంటర్ ను కూడా మంజూరు చేయించారు. కళాశాలకు అనేక వసతులు కల్పించారు. అలాగే ఇంకా అనేక మంది పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

2004 లో సిద్ధిపేట ఎమ్మెల్యే గా హరీష్ రావు గెలిచిన తర్వాత సిద్దిపేట కాలేజీ ఎంతో అభివృద్ధి చెందింది. పీజీ సెంటర్ ను పూర్తి స్థాయి పీజీ కళాశాలగా తీర్చిదిద్దారు. ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు ప్రారంభమయ్యాయి. డిగ్రీ కళాశాలలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫిషరీష్ కోర్సుకు శ్రీకారం చుట్టారు. అంబేడ్కర్ దూర విద్యాకేంద్రానికి ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. పీజీ కళాశాల భవనానికి కూడా నిధులు మంజూరయ్యాయి. ఇదే కళాశాల ఆవరణలో మహిళా డిగ్రీ కళాశాలను ప్రత్యేకంగా మంజూరు చేయించి  భవనాలను నిర్మించారు. కళాశాల మైదానాన్ని మినీ స్టేడియంగా తీర్చిదిద్దడంతో  క్రీడాకారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

ఇటీవల 20లక్షల రూపాయలతో కాలేజీని పూర్తిగా ఆధునీకరించారు. కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఇటీవల కేవీ రమణాచారి తండ్రి కేవీ రాఘవాచారి పేరుతో మెుట్టమెుదటి తెలంగాణ సాహిత్యపీఠాన్ని ఏర్పాటు చేశారు . ఇటీవల రాష్ట్ర స్థాయి సాహిత్య పాఠశాలను కూడా నిర్వహించారు. కళాశాల విద్యార్థులు సిద్దిపేట జిల్లా శాసనాలపై చేసిన పరిశోధనకు రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. అలాగే  కాలేజీలోని కామర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ,  హిస్టరీ విద్యార్థులు నూతన పరిశోధనలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.

ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందిస్తున్న సిద్దిపేట డిగ్రీ కాలేజీ ఇప్పటికే  న్యాక్-A సాధించింది. త్వరలోనే A++ గ్రేడ్ ను సాధించేదిశగా అడుగులేస్తున్నది. ఆ గుర్తింపును కూడా సాధిస్తే సిద్దిపేట రాష్ట్రంలోనే టాప్ మోస్ట్ కాలేజీల లిస్టులో చేరడం ఖాయం.