40 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు!

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్.ఆర్.ఎస్.పి.) కాలువలన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, వచ్చే ఏడాది నుంచి వందకు వందశాతం ఆయకట్టుకు నీరందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎస్.ఆర్.ఎస్.పి. కాలువల ద్వారా 16 లక్షల ఎకరాలకు, ఇతర ప్రాజెక్టుల ద్వారా 24 లక్షల ఎకరాలకు మొత్తం 40 లక్షల ఎకరాలకు గోదావరి నదీ జలాలు అందాలని చెప్పారు. గోదావరి నదిలో తెలంగాణకున్న వాటా ప్రకారం నీరు వాడుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే ఏడాది నుంచే నీరు వాడుకునే వెసులుబాటు ఉందని వివరించారు. పుష్కలమైన నీటి లభ్యత ఉండి, నిధుల కొరత లేదని.. ఈ పరిస్థితుల్లో రైతులకు సాగునీరు అందించలేకపోతే పాపం చేసినట్లేనని ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సారెస్పీని సమర్థంగా వాడుకునే అంశంపై సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు.

ఎస్.ఆర్.ఎస్.పి. నుంచి నడిగూడెం వరకు 346 కిలోమీటర్ల మేర కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎన్ని నిధులైనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్.ఆర్.ఎస్.పి. కాలువల కింద మొత్తం 16 లక్షల ఎకరాల్లో, ఎల్ఎండీ దిగువన ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించాలని సూచించారు. వీటి పరిధిలోని చెరువులన్నీ పూర్తిస్థాయిలో నింపాలని ఆదేశించారు. పాలకుర్తి, స్టేషన్ ఘణపూర్, డోర్నకల్, తుంగతుర్తి తదితర నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే చెరువులను రిజర్వాయర్లుగా మార్చే అవకాశాలను పరిశీలించి, అంచనాలు తయారు చేయాలని చెప్పారు.

సమైక్య పాలనలో ఎస్.ఆర్.ఎస్.పి.ని కట్టినట్టే చూపించి, నీళ్లిచ్చినట్లే మభ్యపెట్టారు గానీ పూర్తి స్థాయిలో నీళ్లు ఎప్పుడూ ఇవ్వలేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఫలితం రైతులకు దక్కాలని సీఎం అన్నారు. గోదావరిలో సమైక్య రాష్ట్రంలోనే మనకు 950 టీఎంసీల నీటి వాటా ఉందని తెలిపారు. కానీ ఎన్నడూ మన వాటాకు అనుగుణంగా నీటిని వాడుకోలేదని చెప్పారు. ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా కూడా 500 నుంచి 600 టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేమని వివరించారు. ఈ నీటిని వాడుకున్నా 40 లక్షలకు పైగా ఎకరాలకు గోదావరి నుంచి నీళ్లు అందించవచ్చని చెప్పారు. తెలంగాణ రైతులు మొగులుకు ముఖం పెట్టి చూసే పరిస్థితి పోవాలన్న సీఎం.. కాల్వల ద్వారా రెండు పంటలకు నీరందాలని సూచించారు. చెరువులన్నీ ఎప్పటికీ నిండే ఉండాలన్నారు.

వచ్చే ఏడాది జూన్ నాటికి మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని తోడడం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అక్కడ నుంచి మిడ్ మానేరు, ఎల్.ఎం.డి.లకు నీరు చేరుతుందని చెప్పారు. అక్కడ నుంచి పాత కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు నీరు రావాలన్నారు. ఎల్.ఎం.డి. దిగువ భాగంలోనే ఎస్.ఆర్.ఎస్.పి. కింద 8.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని.. కానీ కాల్వలు సరిగా లేవని సీఎం చెప్పారు. ఎల్.ఎం.డి. నుంచి 8 వేల 500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీరు ప్రవహించేలా కాల్వలుండాలన్నారు. కానీ 6 వేల క్యూసెక్కుల సామర్థ్యం మాత్రమే తట్టుకునేలా కాల్వలున్నాయని చెప్పారు. వెంటనే కాల్వల సామర్థ్యాన్ని పెంచాలని, దానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.

కాళేశ్వరం నీరు అందేలోగానే, వచ్చే ఎండాకాలం పూర్తయ్యే నాటికి కాల్వల పనులు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ పెట్టారు. ప్రధాన కాల్వలు, డీబీఎం కాల్వలు, పంట కాల్వలన్నీ సిద్ధం కావాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వలు ప్రవహించే మార్గంలో చెరువులన్నీ నింపాలని చెప్పారు. మైలారం, రోళ్లకల్, ఫణిగిరి, కేతిరెడ్డి ఆనకట్, కొత్తగూడ, బయ్యన్నవాగు, మాటేడు తదితర చెరువుల సామర్థ్యం పెంచి, రిజర్వాయర్లుగా మార్చే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పర్వతగిరి చెరువు సామర్థ్యం పెంచాలన్నారు. ఇంకా ఏవైనా చెరువుల సామర్థ్యాన్ని పెంచగలిగితే పెంచాలని చెప్పారు. వీటికి సంబంధించి వారం పది రోజుల్లో అంచనాలు తయారు కావాలని ఆదేశించారు. 45 రోజుల్లో టెండర్లు పిలిచి, ఈ అక్టోబర్ లో పనులు ప్రారంభించాలన్నారు. వచ్చే ఎండాకాలం లోపు పనులు పూర్తి కావాలని, ఇందుకోసం పనులను ఎక్కువ ప్యాకేజీలుగా విభజించాలని సీఎం సూచించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన కృషి, మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని సీఎం అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కొత్తూరు వద్ద బ్యారేజీలు నిర్మించుకుంటున్నామని చెప్పారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులో నీటి లభ్యత పుష్కలంగా ఉంటుందని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకున్న 500 కిలోమీటర్ల పొడవు గోదావరి నదిలో 275 కిలోమీటర్ల మేర నదిలో ఎప్పుడూ పుష్కలమైన నీరు నిల్వ ఉంటుందని వివరించారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువులు నింపుకుంటూనే ఉండాలన్నారు. కాల్వల ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు పంపించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి దాదాపు 35 వేల కోట్ల రూపాయలను నీటి పారుదల రంగానికి ఖర్చు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని అధికారులకు చెప్పారు. ఎక్కడికక్కడ పనులను స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలో మంత్రులు తమ పరిధిలోని పనులు వేగంగా జరిగేటట్లు చూడాలన్నారు. కేవలం సమీక్షలతో సరిపోదన్న సీఎం.. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు. ఏమైనా అవాంతరాలు ఎదురైతే తొలగించాలన్నారు. తమ ప్రాంత రైతులకు సాగునీరు అందించడం తమ బాధ్యత అని ఎమ్మెల్యేలు, మంత్రులు అనుకోవాలని సీఎం సూచించారు.

తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, రెడ్యానాయక్, కిషోర్ తదితరులు ముఖ్యమంత్రికి వినతులు చేశారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్టు కెనాల్ కు మూలాధారమైన లక్ష్మి కెనాల్ ఆధునీకరణ పనులు చేపట్టాలన్న ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి వినతికి సీఎం సానుకూలంగా స్పందించారు. వరద కాలువ, ఎస్ఆర్ఎస్పి కాలువల మధ్య ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి లిఫ్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఎస్.ఆర్.ఎస్.పి. కాల్వల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణను వేగవంతం చేయాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లను సీఎం కేసీఆర్ కోరారు.

ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గాదరి కిషోర్, ఏనుగు రవీందర్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎస్.ఇ. నాగేందర్, ఎస్.ఇ.లు, ఇఇలు పాల్గొన్నారు.