4 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 4వేల మందికి ఉద్వాసన చెప్పేందుకు పావులు కదుపుతున్నది. యూఎస్ బయట ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ రంగంలో ఈ కోతలు ఉంటాయని తెలుస్తోంది. పర్మనెంట్ సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్ సంస్కరణల్లో భాగంగా ఈ మార్పులు చేర్పులు ఉంటాయని కొందరు కంపెనీ సిబ్బంది చెబుతున్నారు. ఎంఎస్ ఆఫీస్ లైసెన్సింగ్ విధానంలో పాత పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త సబ్‌స్క్రిప్షన్ విధానాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల సేల్స్ విభాగంలో ఉద్యోగుల అవసరం తగ్గుతుందని భావిస్తున్న సంస్థ ఆ మేరకు ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని యోచిస్తోంది. అబ్జర్వేషన్‌లో ఉన్న ఉద్యోగులు, తీసివేయబోయే ఉద్యోగులను గుర్తించే చర్యలు ప్రారంభించినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అన్ని కంపెనీల్లానే తాము కూడా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనే కోరుకుంటామని, తాజా నిర్ణయం కారణంగా కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని, అదే సమయంలో మరికొన్ని అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు. కాగా, ప్రస్తుతం అమెరికాలో 71 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఆమెరికా ఆవల 1,21,000 మంది పనిచేస్తున్నారు.