30లోగా జీఎస్టీఎన్ లో రిజిస్టర్ చేసుకోండి!

ఈ నెల చివరిలోగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద రిజిస్టర్ చేసుకోవాలని ట్రేడర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. రూ.20 లక్షల లోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపార వేత్తలు లేదా సంస్థలకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చింది. జీఎస్టీ చట్టానికి లోబడి ఈ నెల చివరి వరకు వేచి చూడకుండా అంతకుముందే రిజిస్టర్ చేసుకోవాలని ఆర్థికశాఖ సూచించింది. రిజిస్టర్ చేసుకున్న సంస్థలు జీఎస్టీ కింద ప్రయోజనాలు పొందవచ్చని, ముఖ్యంగా ఇన్‌పుట్ ట్యాక్స్‌ను బదలాయింపులోనూ, గతంలో పలు రకాల పన్ను చెల్లింపులకు స్వస్తి పలికి ఒకే పన్ను చెల్లించేందుకు వీలుంటుందని చెప్పింది.

రూ.20 లక్షల కంటే అధిక ఆదాయం కలిగిన సంస్థలు లేదా వ్యాపారవేత్తలు కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని, ఇందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని సూచించింది. గతంలో ఎక్సైజ్, వ్యాట్ లేదా సేవా పన్ను చెల్లిస్తున్న వారు జీఎస్టీఎన్ పోర్టల్‌కు బదిలీ అయ్యారని, వీరందరికీ ఐడీ కార్డులను జారీ చేసినట్లు, సెప్టెంబర్ 22 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనున్నదని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న వారు జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకోకపోతే ఈ నెల 22న వారి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు తెలిపింది. పాన్, ఈ-మెయిల్, మొబైల్ నంబర్ కలిగిన వ్యాపారవేత్తలు లేదా సంస్థలు https://www.gst.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.