20 పతకాలతో దూసుకెళ్తున్న భారత్

ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత్ ఎదురన్నది లేకుండా దూసుకెళుతున్నది. ప్రత్యర్థులను అలవోకగా అధిగమిస్తూ పతకాలను ఒడిసిపడుతున్నది. మూడో రోజు చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో సహా రజతం, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్న భారత్ ఓవరాల్‌గా 20 పతకాలతో టాప్‌లో కొనసాగుతున్నది. మూడో జరిగిన మహిళల 3000మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో సుధాసింగ్ స్వర్ణపతకంతో మెరిసింది. స్వైన్‌ఫ్లూ బారి నుంచి పూర్తిగా కోలుకుని రియో ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి రేసులోనే సుధ సత్తాచాటింది. ఉత్కంఠభరితంగా జరిగిన రేసును ఈ 31 ఏండ్ల యూపీ అథ్లెట్ 9:59:47సెకన్ల టైమింగ్‌తో ముగించింది. నాలుగు ఆసియా చాంపియన్‌షిప్‌లలో సుధకు ఇదే తొలి పసిడి పతకం. దీని ద్వారా వచ్చే నెలలో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించింది. మహిళల 400మీటర్ల హార్డిల్స్‌లో అను రాఘవన్(57.22సె) రజతంతో ఆకట్టుకుంది.

అటు పురుషుల 400మీటర్ల హార్డిల్స్‌లో జబీర్ 50.22 సెకన్లతో కాంస్యాన్ని కొల్లగొట్టాడు. మరోవైపు మహిళల 4X100 మీటర్ల రేసులో ద్యుతీచంద్, సర్బానీ నందా, హిమశ్రీ రాయ్, మెర్లిన్ జోసెఫ్‌లతో కూడిన భారత బృందం 44.57 సెకన్ల టైమింగ్‌తో కాంస్య పతకం సాధించింది. మహిళల లాంగ్‌జంప్‌లో షీనా(13.42మీ)కు కాంస్యం దక్కింది.