10 రోజుల్లో మిడ్ మానేరు పనులు పూర్తి చేయాలి  

2006లో ప్రారంభించిన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిపోయిన పనులను వారం పది రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. మిడ్ మానేరులో 10 టి.ఎం.సిల నీళ్లు రానున్నందున దానికి అనుగుణంగా కాలువల పనులు సిద్ధం చేయాలని సూచించారు. పదేళ్ళలో యాభై శాతం పనులు పూర్తయితే మిగతా యాభై శాతం పనులు గత పన్నెండు నెలల్లోనే పూర్తి చేశామని హరీశ్ రావు తెలిపారు. మిడ్ మానేరు  ప్రాజెక్టు పురోగతి, భూ నిర్వాసితుల సమస్యలపై మంత్రి హరీశ్‌ రావు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో సమీక్షించారు.  ఈ సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల, రసమయి, ఒడితెల సతీష్, మనోహర్ రెడ్డి, పుట్ట మధు, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మిడ్ మానేరు ప్రాజెక్టులో మొత్తం కాంక్రీటు వర్క్ 4.8 లక్షల క్యూబిక్ మీటర్లు కాగా.. గత పది సంవత్సరాలలో 65 వేల 200 క్యూబిక్ మీటర్లు పని చేశారని హరీశ్‌ రావు వివరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 3.49 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయని చెప్పారు. గత పన్నెండు నెలల్లో  1.30 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీటు పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం 639 కోట్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు దాదాపు 11 సంవత్సరాలలో 107 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం రూ.358 కోట్లు ఖర్చు చేసిందన్న ఆయన.. గత 12 నెలల్లోనే రూ.251 కోట్లను ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టామని తెలిపారు. అలాగే ఎం.ఎం.ఆర్ లో మొత్తం ఎర్త్ వర్కు 1 కోటి 38 లక్షల క్యూబిక్ మీటర్లు జరగాల్సి ఉండగా.. 80 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్స్ మూడేళ్లలో జరిగాయని చెప్పారు. గత 12 నెలల్లోనే 60 లక్షల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్కు జరిగినట్టు హరీష్ రావు తెలిపారు. అంటే గత 10 సంవత్సరాలలో జరిగింది కేవలం 41 లక్షల క్యూబిక్ మీటర్ల పనే అని ఆయన వివరించారు.

ఇటు మిడ్ మానేరుకు చెందిన డిస్ట్రిబ్యూటరీలను వెంటనే పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌ రావు అధికారులను ఆదేశించారు. కొత్తగా అమలులోకి వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో భూములు సేకరించాలని కోరారు. మిడ్ మానేరు ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి తెలిపారు. మరోవైపు రీ ఇంజనీరింగ్ లో భాగంగా మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి లింక్ కెనాల్ నిర్మస్తున్నందున.. తోటపల్లి రిజర్వాయర్ ను ఇదివరకే రద్దు చేశారు. అయితే ఈ పథకం కింద సేకరించిన 400 ఎకరాలను దరఖాస్తు చేసుకున్న వారికి తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూముల వాపస్ కు ఒక కటాఫ్ తేదీని ప్రకటించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. కటాఫ్ తేదీ లోపు దరఖాస్తు చేసుకోకపోతే ప్రభుత్వం ఆ 400 ఎకరాలను పరిశ్రమలు లేదా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించేలా చట్టప్రకారం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు.

ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపైనా మంత్రి హరీశ్‌ రావు సమీక్షించారు. ఎల్లంపల్లి నుంచి ఈ సంవత్సరం ఒక లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లికి సంబంధించిన రిజర్వాయర్లు, పంపు హౌజ్ లు పూర్తి అయినప్పటికీ.. భూసేకరణ జాప్యంతో కాలువల పనులు పూర్తి కాలేదన్నారు. కొత్త చట్టం ప్రకారం వెంటనే భూసేకరణ జరిగితేనే.. కాలువలు పూర్తయి 1 లక్ష ఎకరాలకు ఈ ఖరీఫ్ లో సాగునీటిని అందించగలమని చెప్పారు. భూసేకరణ వేగవంతం కోసం శాసనసభ్యులు,ఇతర రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకోవాలని మంత్రి హరీశ్‌ రావు కోరారు.