1.3% పెరిగిన ఇన్ఫోసిస్ లాభం

దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతి సంస్థ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకుమించి నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,483 కోట్ల నికర లాభాన్ని (ఒక్కో షేరుపై రూ.15.24) ఆర్జించినట్లు కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.3,436 కోట్ల లాభంతో (ఒక్కో షేరుపై రూ.15.03) పోలిస్తే 1.3 శాతం వృద్ధిని కనబరిచింది. ఉత్తర అమెరికా, యూరప్ మార్కెట్లలో కీలక క్లయింట్లను చేజిక్కించుకోవడం సంస్థ లాభాలు పుంజుకోవడానికి దోహదపడింది. అంతర్జాతీయ మార్కెట్ల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ప్రస్తుతం సద్దుమనగడంతో గైడెన్స్‌ను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయ వృద్ధి 7.1-9.1 శాతం మధ్యలో ఉండవచ్చని అంచనా వేసింది. గతంలో విడుదల చేసిన ఔట్‌లుక్‌లో వృద్ధిని 6.1-8.1 శాతంగా అంచనావేసింది. అలాగే కరెన్సీ గైడెన్స్ 6.5-8.5 శాతం మధ్యలో ఉండనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 1.7 శాతం పెరిగి రూ.17,078 కోట్లకు చేరుకుంది. 2016-17 ఏడాది ఇదే సమయంలో రూ.16,782 కోట్లుగా ఉంది. పాలన ప్రమాణాల విషయంలో ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి, బోర్డు సభ్యుల మధ్య అభిప్రాయ విభేధాలు పొడచూపినప్పటికీ క్లయింట్లను ఆకట్టుకోవడంలో సంస్థ ముందువరుసలో నిలిచింది. తొలి త్రైమాసికంలో 100 మిలియన్ డాలర్ల కంటే అధిక విలువైన ఎనిమిది క్లయింట్లను చేజిక్కించుకున్నది.