డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్

డ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎం కేసీఆర్  ఆదేశించారు. కల్తీలకు పాల్పడడం, డ్రగ్స్ సరఫరా చేయడం లాంటి దుర్మార్గాలు తెలంగాణలో చేయలేమని అక్రమార్కులు భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నరు. ఈ దందాలో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులైనా, చివరికి కేబినెట్ మంత్రి పాత్ర ఉన్నా కేసు పెట్టాలని ఆదేశించారు. రక్తాన్ని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారనే విషయం తెలిసి తన మనసెంతో చలించిందని, ఇలాంటి వారికి జీవితకాల కారాగార శిక్ష పడే విధంగా అవసరమైతే కొత్త చట్టాలు తేవాలని సీఎం కేసీఆర్ అన్నరు. పేకాట, గుడుండా నియంత్రణ విషయంలో విజయం సాధించినట్లే డ్రగ్స్, కల్తీల విషయంలో కూడా తుది విజయం సాధించే వరకు విశ్రమించవద్దని అధికారులను కోరారు. డ్రగ్స్, కల్తీలను అరికట్టే విషయంలో తెలంగాణ పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులు చేస్తున్న కృషి చాలా గొప్పగా ఉందని అభినందించారు. డ్రగ్స్, కల్తీలు, ఇతర సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్   ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టర్  అకున్ సబర్వాల్  హాజరయ్యారు.