హైదరాబాద్-కొలంబో మధ్య విమాన సర్వీసు

హైదరాబాద్ నుంచి కొలంబో కు నాన్-స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(జీహెచ్‌ఏఐఎల్) నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వారానికి నాలుగు రోజులు అంటే ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ సర్వీసును నడుపనున్నదని జీహెచ్‌ఐఏఎల్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ తెలిపారు. ఇందుకోసం సంస్థ ఏ320 విమానాన్ని వినియోగించనున్నది. ఈ నూతన సర్వీసును ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని ఆయన తెలిపారు. టూరిస్ట్ కేంద్రంగా కొనసాగుతున్న శ్రీలంకను సందర్శించే ప్రయాణికుల సంఖ్య ప్రతియేటా పెరుగుతున్నారని, ముఖ్యంగా 1, 600 కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాతం భారతీయులను ఆకట్టుకుంటుందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1.52 కోట్ల మంది ఈ విమానాశ్రయం గుండా ప్రయాణించారు. అంతక్రితం ఏడాది ప్రయాణించిన వారితో పోలిస్తే 22 శాతం పెరిగారు. అటు హైదరాబాద్ నుంచి కొలంబోకు నాన్-స్టాప్ విమాన సర్వీసు ప్రారంభించనున్నట్లు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానాన్ని ప్రారంభించాలని కొలంబో పర్యటన సమయంలో మంత్రి కేటీఆర్.. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ సీఈవోను కోరారు.