హైదరాబాద్‌కు చేరిన అమర్‌నాథ్‌ యాత్రికులు

తెలంగాణ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి టెర్రరిస్టుల దాడికి గురైన యాత్రికులు సురక్షితంగా హైదరాబాద్‌ చేరారు. శ్రీనగర్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న వారు. అక్కడి నుంచి విమానాల్లో నగరానికి చేరుకున్నారు. ట్రావెల్ ఏజెంట్ ఓంప్రకాశ్, యాదగిరిగౌడ్, ఆయన భార్య అనూరాధ, లక్ష్మీబాయి శ్రీనగర్ నుంచి నేరుగా హైదరాబాద్ రాగా.. మిగిలిన వారు ఎనిమిది విమానాల్లో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. వారిని రెండు వేర్వేరు విమానాల్లో భవన్ అధికారులు శనివారం రాత్రి హైదరాబాద్‌కు పంపించారు. కొద్దిమంది ఇంకా గాయాలతో బాధపడుతున్నారు.

బస్సులో సిలిండర్‌ పేలిందన్న వార్త ఫేక్‌ అని.. అది వాస్తవం కాదని స్పష్టం చేశారు బాధితుడు వెంకట్‌గౌడ్. క్వాజీకుండ్ సమీపంలోని ఒక హోటల్ దగ్గర గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో రాత్రి భోజనం కోసం ఆపామని చెప్పారు. భోజనం చేశాక ఏడున్నర గంటల ప్రాంతంలో బస్సు బయలుదేరగా కొందరు బస్సుపై పెట్రో బాంబులు వేయగా గాయాలయ్యాయని వివరించారు. డ్రైవర్ బస్సును ఆపకుండా దాదాపు అర కిలోమీటర్ దూరం వరకు తీసుకెళ్లాడని, భారీ శబ్దం రావడంతో అప్పటికే అప్రమత్తమైపోయిన సీఆర్పీఎఫ్ పోలీసులు బస్సును ఆపి తమను రక్షించారని వివరించారు. గాయపడినవారిని వెంటనే సీఆర్పీఎఫ్ పోలీసులు.. క్వాజీకుండ్ దవాఖానకు తీసుకెళ్లారని, తీవ్రంగా గాయపడినవారిని అంబులెన్స్ ద్వారా శ్రీనగర్ దవాఖానకు తరలించారని తెలిపారు.

కామారెడ్డి, కరీంనగర్, ఆర్మూరు, హైదరాబాద్‌కు చెందిన 47 మంది యాత్రికులు ఆగ్రా నుంచి ప్రత్యేక బస్సులో అమర్‌నాథ్‌యాత్రకు బయలుదేరారు. ఐదో తేదీన దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం, సీఆర్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులందరి సహాయ సహకారాలతో తాము స్వస్థలాలకు చేరుకున్నామని బాధితులు తెలిపారు. శంకర్ శర్మ మృతదేహాన్ని శ్రీనగర్ ప్రభుత్వ అధికారులు విమానం ద్వారా శ్రీనగర్-ముంబై మీదుగా హైదరాబాద్‌కు తరలించారు. గాయపడినవారిలో ఆరుగురు మినహా మిగిలిన 36 మందిని వేర్వేరు విమానాల్లో శ్రీనగర్ నుంచి శనివారం సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు తరలించారు. అక్కడి నుంచి రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాద్‌కు పంపించారు. తీవ్ర గాయాలతో శ్రీనగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న  రాజ్యలక్ష్మి, విశ్వనాథం, ఆయన భార్య విజయ, జయంతి, సుజాత, వాసరయ్యను వైద్యుల సూచన మేరకు ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి పంపనున్నారు. ఢిల్లీ భవన్‌కు చేరుకున్న వీరందరికీ తెలంగాణ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి హైదరాబాద్ ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.

శనివారం రాత్రి రెండు విమానాల్లో సూమారు 18 మంది ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరిలో కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ వారు ఉన్నారు. కరీంనగర్‌కు చెందిన శంకర్ శర్మ మృతదేహాన్ని కూడా తీసుకువచ్చారు. అప్పటివరకు విమానాశ్రయంలో వేచి ఉన్న బంధువులు.. తమవారి రాకతో ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు.