హరిత హారం ప్రారంభోత్సవానికి సిద్ధం

మూడో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్‌ రేపు కరీంనగర్‌ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ యేడాది జిల్లా వ్యాప్తంగా కోటి పది లక్షల మొక్కలు నాటాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే లక్ష మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి ఈటల రాజేందర్, మేయర్ రవీందర్ సింగ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

సీఎం కేసీఆర్ కరీంనగర్ లో బైపాస్ రోడ్‌ లోని ఎల్ఎండీ కట్ట దిగువన మొక్క నాటుతారు. సీఎం హరితహారాన్ని ప్రారంభించే రోజు 20 నుంచి 25 వేల మొక్కలు నాటి మిగతావి వారం రోజుల్లో నాటాలని నిర్ణయించారు. మొక్కలు నాటే కార్యక్రమం పూర్తవగానే అంబేద్కర్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

కరీంనగర్ లో లక్ష మొక్కలు నాటేందుకు నగరంలోని 50 డివిజన్లను ఐదు సెగ్మెంట్లుగా విభజించారు. మొదటి సెగ్మెంట్ లో 4 వేల 110, రెండో సెగ్మెంట్‌ లో 3 వేల 854, మూడో సెగ్మెంట్‌ లో 53 వేల 403, నాలుగో సెగ్మెంట్‌ లో 22 వేల 848, ఐదో  సెగ్మెంట్ లో 15 వేల 765 మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటికే ఖమ్మంతో పాటు ఇతర జిల్లాల నుంచి 85 వేలకు పైగా మొక్కలను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. వీటితో పాటు మొక్కల సంరక్షణ కోసం ట్రీ గార్డులను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే లక్ష మొక్కలు నాటేలా ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్వించారు.

సీఎం పాల్గొనే రోజు కరీంనగర్ లో ఒకేసారి లక్ష మొక్కలు నాటే అవకాశం లేకపోవడంతో ముందుగానే మొక్కలు నాటుతున్నారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి సిరిసిల్ల బైపాస్ రోడ్ వరకు ఇరువైపులా, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ కు స్వాగతం తెలుపుతూ నగరంలో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.

సీఎం రాక సందర్భంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ ఐలాండ్ లను పచ్చని తివాచీ పరిచినట్లుగా గడ్డితో అందంగా అలంకరించారు. రోడ్ల మధ్య డివైడర్లలో రంగు రంగుల పూల మొక్కలను నాటారు. ప్రధాన వీధుల్లో గోడలపై జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా వివిధ రకాల చిత్రాలను ఆర్టిస్టులతో వేయిస్తున్నారు.