హరితహారానికి సిద్ధం

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మూడో విడత హరితహారానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. ఈ నెల 12న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్ లో ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి మొక్కలు నాటిన వెంటనే ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో నాటిన మొక్కలు 67 శాతం బతికే ఉన్నాయని వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మూడో విడత హరితహారంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తామని మంత్రి రామన్న చెప్పారు. హరితహారం కార్యక్రమంలో గత ఏడాది నిజామాబాద్ జిల్లా  మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈసారి కూడా హరిత అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మొక్కలు నాటడానికి, నాటిన మొక్కలను కాపాడటానికి ఎక్కడికక్కడ హరిత రక్షణ కమిటీల ఏర్పాటు చేశామని, 500 మొక్కలకు ఒక హరిత సైనికుడు ఉంటారని మంత్రి జోగు వెల్లడించారు. ఒక్కో మొక్కకు 15 రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నామని వివరించారు.

చెట్లు ఎక్కువగా ఉంటే రోగాలు దూరం అవుతాయని అవగాహన కల్పించే విధంగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి రామన్న తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హరితహారం కార్యక్రమాన్ని మెచ్చుకున్నారని ఆయన గుర్తుచేశారు. కేంద్రం నుంచి అటవీ అభివృద్ధికి రూ. 1600 కోట్ల నిధులు రావాల్సిఉందన్నారు. హరితహారం కోసం అటవీశాఖ ఇప్పటి వరకు రూ. 980 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.