సొంత ఉద్యోగులనే బలిపశువులను చేస్తున్న ఏపీ

ఏపీ ప్రభుత్వం సొంత ఉద్యోగులనే బలిపశువులను చేస్తోంది. విభజన వ్యవహారాలన్నింటినీ వివాదాస్పదం చేసి, పరిష్కారం కాకుండా కుట్రలు చేస్తున్న ఏపీ సర్కార్ ఏపీ స్థానికత కలిగిన సెక్షన్ ఆఫీసర్ల విషయంలో కూడా అదే దిక్కుమాలిన ఎత్తుగడతో అభాసుపాలైంది. ఆరునెలలుగా తమ ప్రాంత ఉద్యోగులను ఇరుకాటంలో పెట్టి పబ్బం గడుపుకొంటున్నది. దీంతో ఏపీ సెక్షన్ అధికారుల విభజన వివాదం ముదిరి పాకాన పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్ ఎస్పీసింగ్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘాటు లేఖ రాశారు. ఏపీ స్థానికత గల 24 మంది సెక్షన్ అధికారులను ఏపీకి కేటాయించిన విధానాన్ని, చట్టబద్ధ వివరాలను, ఉద్యోగుల విభజన సలహాసంఘం తీర్మానాలను లేఖలో ప్రస్తావించారు.

విభజన సలహాసంఘం సమావేశంలో తెలంగాణ సీఎస్, ఏపీ సీఎస్ కలిసి తీసుకున్న నిర్ణయాలను, సమావేశం చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తీర్మానాల ప్రకారం ఏపీ స్థానికతగల 24 మంది సెక్షన్ ఆఫీసర్ల కోసం ఏపీ ప్రభుత్వం సూపర్‌న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసుకోవాలని, వారిని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ సీఎస్ కోరారు. కాగా ఈ 24 మంది ఆఫీసర్లు తాము జన్మించిన ఏపీలోనే పనిచేస్తామని స్పష్టంగా ఆప్షన్లు ఇచ్చారు. వారిని ఏపీకి కేటాయించేందుకు కమలనాథన్ సారథ్యంలోని ఉద్యోగుల విభజన సలహాసంఘం సమావేశంలో నిర్ణయం కూడా జరిగింది. కానీ ఎక్కడ కుట్రలు జరిగాయో ఏమో గానీ, కేంద్ర డీవోపీటీ నుంచి వచ్చిన ఆర్డర్‌లో వీరిని తెలంగాణకు కేటాయించినట్లు ఉన్నది.ఏపీకి చెందిన సెక్షన్ అధికారులను ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ సెక్రటేరియట్‌కు అనుమతించే ప్రసక్తిలేదని టీఎన్జీవో యూనియన్‌ నేతలు స్పష్టం చేశారు.