సింగరేణితో కర్నాటక భారీ ఒప్పందం

ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి నుంచి 81 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేసేందుకు కర్నాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి సీఎండీ శ్రీధర్, కేపీసీఎల్ ఎండీ కుమార్ నాయక్ ల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. సింగరేణి సంస్థ కర్ణాటకలోని రాయచూర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది 30 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేస్తుంది. అలాగే  కేపీసీఎల్ సంస్థ ఇటీవల ఎర్రమారస్ లో నిర్మించిన మరో థర్మల్ విద్యుత్ కేంద్రానికి 20 లక్షల టన్నుల బొగ్గు అందించనుంది. దాంతోపాటు బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మరో 31 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ సరఫరా చేయనుంది. మొత్తమ్మీద ఈ ఏడాదికి 81 లక్షల టన్నుల బొగ్గు అందజేయడానికి సింగరేణి సంస్థ అంగీకరించింది.