సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో భూ సంబంధిత వివాదాల‌ను అరిక‌ట్ట‌డానికి జీహెచ్‌ఎంసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా  ఖాళీగా ఉన్న‌ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల వివ‌రాలన్నింటిని ప్ర‌జ‌ల‌కు తెలిసేలా వెబ్‌సైట్‌లో ప్ర‌ద‌ర్శించ‌డానికి అనుమ‌తివ్వాల్సిందిగా ప్ర‌భుత్వానికి లేఖ రాయాల‌ని సిటీ స‌మ‌న్వ‌య క‌మిటి స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఇమ్లీబ‌న్ మ‌హాత్మ‌గాంధీ బ‌స్టాండ్ ఆవ‌ర‌ణ‌లోని ఆర్టిసి కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి  జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల క‌లెక్ట‌ర్లు ర‌ఘునంద‌న్‌రావు, ఎం.వి.రెడ్డి, హైద‌రాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి, టి.ఎస్‌.ఆర్‌.టి.సి ఈ.డి. పురుషోత్తంనాయ‌క్‌, ట్రాఫిక్ డిసిపిలు ర‌వీంద‌ర్‌, ర‌మేష్‌నాయుడు త‌దిత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

జీహెచ్‌ఎంసీ  ప‌రిధిలో క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల‌కు, జీహెచ్ఎంసీ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ఫిర్యాదుల్లో అధిక శాతం భూ సంబంధిత ఫిర్యాదులే ఉన్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి తెలిపారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆయా భూముల వివ‌రాల స‌మాచారం     న‌గ‌ర‌వాసుల‌కు తెలియ‌క‌పోవ‌డమేనన్నారు. వీటి నివార‌ణ‌కు న‌గ‌రంలోని భూముల వివ‌రాలు, వాటి యాజ‌మ‌న్య హ‌క్కులు, విస్తీర్ణంతో కూడిన వివ‌రాల‌ను వెబ్‌సైట్‌లో ప్ర‌ద‌ర్శించేందుకు అనుమ‌తించేలా కోరుతూ ప్ర‌భుత్వానికి లేఖ రాయాల‌ని జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. గ్రేట‌ర్ ప‌రిధిలో  నాలాల విస్త‌ర‌ణ‌కు తీవ్ర అడ్డంకిగా ఉన్న 1002 అక్ర‌మ‌ణ‌ల‌ను  తొల‌గించేందుకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు త‌దిత‌ర సంబంధిత విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని క‌మిష‌న‌ర్ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా నాలాల్లో ఉన్న అక్ర‌మ‌ణ‌లు, ఆస్తుల స‌ర్వేతో పాటు వాటి విలువ నిర్థార‌ణ త‌దిత‌ర అంశాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని జీహెచ్ఎంసీ ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. నాలా విస్త‌ర‌ణ‌లో ఇళ్ల‌ను కోల్పోయే నిరుపేద‌ల‌కు వెంట‌నే ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఇళ్ల‌ను కేటాయించ‌డం జ‌రుగుతుంద‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు.

నగ‌రంలోని ర‌హ‌దారుల‌పై ఏర్ప‌డే గుంత‌ల‌ను వెంటనే పూడ్చేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. రోడ్ల‌పై వృథాగా నీరు వ‌ద‌ల‌డం ద్వారా రోడ్లు దెబ్బ‌తింటున్నాయ‌ని, ఇటువంటి వాటిని గుర్తించి జ‌రిమానాలు విధించాల‌ని స్ప‌ష్టం చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉత్త‌మ సేవ‌ల‌ను అందించేవారిని గుర్తించి స‌న్మానించ‌డంతో పాటు నిర్ల‌క్ష్యం వ‌హించే ఉద్యోగుల‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని జ‌నార్థ‌న్‌రెడ్డి ఆదేశించారు. న‌గ‌ర స‌మ‌స్య‌ల‌పై వివిధ మాద్య‌మాల ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. కాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో టీ.ఎస్‌.ఆర్‌.టి.సికి 29 బ‌స్ డిపోలు, 29 ప్ర‌ధాన‌ బ‌స్టాండ్‌లు ఉన్నాయ‌ని, వీటికి డొమెస్టిక్ వాట‌ర్ క‌నెక్ష‌న్లు ఇవ్వాల‌ని ఆర్టిసి ఎగ్జిక్యుటీవ్ డైరెక్ట‌ర్ పురుషోత్తం నాయ‌క్‌ జ‌లమండ‌లి అధికారుల‌ను కోరారు. అదేవిధంగా ఇమ్లీబ‌న్ బ‌స్టాండ్‌కు లీజ్ మొత్తాన్ని త్వ‌రిత‌గ‌తిన నిర్థారించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌ను కోరారు.

రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో హ‌య‌త్‌న‌గ‌ర్ నుండి అంబ‌ర్‌పేట్ మార్గంలో లారీలు, ట్ర‌క్‌ల పార్కింగ్ కోసం ప్ర‌త్యేకంగా భూమిని కేటాయించాల‌ని రాచ‌కొండ ట్రాఫిక్ డిసిపి ర‌మేష్ నాయుడు కోరారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో జంక్ష‌న్ల అభివృద్దిని త్వ‌రిగ‌తిన పూర్తిచేయాల‌ని హైద‌రాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి ర‌వీంద‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ స‌మావేశంలో హెచ్ఎండిఏ, రోడ్డు, భ‌వ‌నాలు, విద్యుత్‌, జ‌ల‌మండ‌లి త‌దిత‌ర విభాగాల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.