సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ ను సందర్శించిన మంత్రి కేటీఆర్

గుజరాత్ లోని అహ్మదాబాద్‌ లో సబర్మతి నదిని అభివృద్ధి పరిచేందుకు ఏర్పాటు చేసిన సబర్మతి రివర్‌ డెవలప్‌ మెంట్‌ ఫ్రంట్‌ ను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. మూసీ అభివృద్ది, సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో… సబర్మతి నది అభివృద్ధి నమూనాపై వారంతా అధ్యయనం చేశారు. సబర్మతి రివర్‌ డెవలప్‌ మెంట్‌ ఫ్రంట్‌ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణలో భాగంగా తలెత్తిన సమస్యలు, నది ఒడ్డున ఉన్న జనావాసాల తరలింపు, మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పట్టిన సమయం తదితర అంశాలను అధికారులు తెలియజేశారు. అహ్మదాబాద్‌ పట్టణానికి రివర్‌ ఫ్రంట్‌ తలమానికంగా నిలిచిందని… అదే తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆ దిశగా ఇప్పటికే నిధుల సేకరణ జరుగుతోందని… తొలి దశ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు.