సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన కేటీఆర్

గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌. మహాత్ముడు చూపిన బాటలోనే గ్రామాల అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న టెక్స్ టైల్స్ ఇండియా సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌… సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

సబర్మతి ఆశ్రమంలో బాపూజీ ఇల్లు, ఉపయోగించిన వస్తువులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సబర్మతి ఆశ్రమ ట్రస్టీలు మంత్రి వెంట ఉండి అక్కడి విశేషాలను వివరించారు. బాపూజీ నివసించిన ఆశ్రమాన్ని చూడటం అదృష్టంగా భావిస్తున్నానని  కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. గాంధీజీ గడిపిన అతి సాధారణ జీవితం ఆశ్రమాన్ని చూడటం ద్వారా అర్థమవుతుందన్నారు. అనంతరం అక్కడి పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు చరఖాను బహూకరించారు.