సత్ఫలితాలిస్తున్న హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్నిస్తున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పాఠశాలలో, పంటపొలంలో, సంస్థలో కానీ వంద మొక్కలకు పైగా నాటితే ప్రత్యేక ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. ఒక మొక్క సంరక్షణకు నెలకు ఐదు రూపాయలైతే …. వెయ్యి మొక్కలకు ఐదువేల చొప్పున జాతీయ ఉపాధిహామీ పథకం కింద అందిస్తున్నది. గ్రామగ్రామాన హరితరక్షణ కమిటీలను వేసి ప్రజలను మొక్కల సంరక్షణలో భాగస్వాములను చేస్తున్నారు. లక్ష్యానికి మించి మొక్కలు నాటే గ్రామ పంచాయతీలకు, స్థానిక సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఒక రోజు.. ఒక లక్ష మొక్కలు అన్న నినాదంతో మూడోవిడుత హరితహారం కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీన్ని విజయవంతం చేయడానికి మంత్రులు ఈటల రాజేందర్, జోగురామన్న అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.

అటవీభూముల్లో నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ చేస్తున్నారు. అటవీశాఖ నాటిన మొక్కల్లో 60 శాతానికి పైగా బతుకడం అద్భుత విజయంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గంతోపాటు మరో నాలుగు జిల్లాల్లో మొత్తంలో సర్వయివైల్  రేట్ 92శాతం వరకు ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 80 శాతానికి పైగా ఉంది. ఆదిలాబాద్ దేవుని గూడెంలో సీఎం గత ఏడాది చేపట్టిన ఒక రోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా నాటిన వాటిలో 97శాతం మొక్కలు బతికాయి. అటవీశాఖమంత్రి జోగురామన్న నిరంతరం ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు.

అటు హెచ్‌ఎండీఏ పరిధిలో రెండుకోట్ల మొక్కల నాటగా అందులో 90శాతం వరకు ప్రాణం పోసుకున్నాయి. హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో వివిధరకాల పూలమొక్కలు, జీవి వైవిధ్య మొక్కలు పచ్చగా ఎదిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో 163 కిలోమీటర్ల పొడవున, హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిలో 181 కిలోమీటర్ల పరిధిలో నాటిన మొక్కలు 90శాతం వరకు బతికినట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్ రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల్లో దాదాపు 80నుంచి 90శాతం బతికాయి. క్షీణించిన అడవుల్లో అసిస్టెడ్ నాచురల్ రీజనరేషన్ పద్ధతి ద్వారా చేపట్టిన మొక్కల పెంపకం మంచి ఫలితాన్నిచ్చింది. సిద్దిపేట, గజ్వేల్‌లో ఈ కార్యక్రమం వందశాతం విజయవంతమయినదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అటవీశాఖ 18,920 హెక్టార్లలోని అడవుల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టిందని ఆ శాఖ అడిషనల్ పీసీసీ డోబ్రియాల్ వెల్లడించారు. 4,691  కిలోమీటర్ల వరకు రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూప్లాంటేషన్ చేపట్టినట్టు తెలిపారు.

హరితహారం ప్రణాళికలో భాగంగా మొత్తం 230 కోట్ల మొక్కల్లో 130 కోట్ల మొక్కలను అడవుల వెలుపల నాటాలని, 100కోట్ల మొక్కలను అడవుల్లో నాటాలని నిర్ణయించారు. మొక్కల సరఫరాకు రాష్ట్రవ్యాప్తంగా 3,900కు పైగా నర్సరీలను ఏర్పాటుచేసి, వివిధ పథకాల కింద దాదాపు రూ.1600కోట్లు వెచ్చించారు. మొదటి ఏడాది 15.86 కోట్లు, 2016 లో 31.67 కోట్ల మొక్కలను నాటారు. ఈసారి వానాకాలంలో 40కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 2,920 నర్సరీల్లో దాదాపు 45.80 కోట్లకుపైగా మొక్కలను సిద్ధంగా ఉంచారు. తెలంగాణకు హరితహారంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ కోరారు.

మొక్కలను విస్తారంగా పెంచేందుకు ప్రభుత్వం ఈసారి సీడ్‌బాంబింగ్ విధానాన్ని అమలు చేయనున్నది. మొక్కలు నాటడానికి వీలులేని చోట్ల మట్టి, పేడతో కలిపి.. మధ్యలో వివిధ రకాల విత్తనాలను ఉంచి విసురుతారు. బంజరుభూములు, రాళ్లు రప్పలు, పొదల మధ్య వేస్తారు. కరీంనగర్ తదితర జిల్లాల్లో కోటి సీడ్‌బాల్‌లు తయారవుతున్నాయి.నర్సరీల్లో ఒక్కో మొక్కను పెంచాలంటే పెద్దఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది. దానికి సమయం కూడా చాలా పడుతుంది. అదే సీడ్ బాల్స్ విధానం ద్వారా తక్కువలో తక్కువ ఒక్కో విత్తన బంతికి ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. మొక్కలు నాటేందుకు అనువుగా లేని ప్రాంతాల్లో సైతం వెదజల్లడం ద్వారా విత్తులు మొలకెత్తి వృక్షాలుగా మారుతాయి. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రగంధ జిల్లాలో ఈ విధానం విజయవంతం కావడంతో ఇక్కడ తొలి ప్రయత్నంగా చేపడుతున్నారు.

విత్తన బంతుల తయారీలో మట్టితోపాటు శనగ పిండి, బెల్లం, గో మూత్రం, సేంద్రియ ఎరువులను వినియోగిస్తారు. ఈ పంచ గవ్యంతో చిన్నచిన్న గోళీల ఆకారంలో బంతులను తయారుచేసి గుట్టలున్న ప్రదేశాల్లో వేస్తారు. ఈ విత్తన బంతుల్లో రావి, మర్రి, వేప, నేరేడు, కానుగ తదితర విత్తనాలను పెట్టి తయారు చేస్తారు.