సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్

సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు మంత్రి హరీశ్  రావు. టీఆర్‌ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మిర్యాలగూడలో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో మంత్రులు హరీశ్ రావు, జగదీశ్  రెడ్డి, తుమ్మల, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ బాలూనాయక్‌, స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అభివృద్ధిని అడ్డుకుంనేందుకు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలకు మూ తోడ్‌  జవాబిచ్చారు.

సంక్షేమ రంగానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ వంటి పథకాలతో పాటు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా సర్కారీ దవాఖానాల్లో వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా బాలింతలకు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని… రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ… కాంగ్రెస్ నాయకులు ధర్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దేనికోసం కాంగ్రెస్‌ నాయకులు ధర్నాలకు దిగుతున్నారో చెప్పాలని హరీశ్‌ రావు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో నల్లగొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కరెంటు కోతలు లేకుండా చేసిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుకే దక్కుతుందన్నారు.

సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలోని పేదలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి తుమ్మల అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సూచనలతో మంత్రి హరీశ్ రావు నిర్విరామంగా పని చేస్తున్నారని… ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇవన్నీ చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని తుమ్మల మండిపడ్డారు.

ప్రతిపక్ష నాయకులు ఇకనైనా పద్ధతి మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని మంత్రులు సూచించారు. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.