శశికళ జైలు దుమారం

బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను వీఐపీ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారన్న ఆరోపణలపై కర్నాటక జైళ్లశాఖ డీజీ సత్యనారాయణ స్పందించారు. శశికళ విషయంలో కోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని.. ఆమెకు ప్రత్యేక భోజనం మాత్రమే ఏర్పాటు చేస్తున్నామన్నారు. శశికళకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించారన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. జైలు సిబ్బంది ఆమెను స్పెషల్‌ గా ట్రీట్‌ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన జైళ్ల శాఖ డీఐజీ రూప అది నిజమేనని నివేదిక ఇచ్చారు. వీఐపీ మాదిరిగా ఆమెకు నచ్చిన ఆహారం అందించేందుకు ఏకంగా ప్రత్యేక వంట గదిని ఏర్పాటు చేశారని, ఇందుకోసం ఏకంగా 2కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీకి సైతం ముడుపులు అందినట్లు తెలిపారు. అందుకే జైలులో శశికళకు ప్రత్యేక మర్యాదలు దక్కుతున్నా ఆయన చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని రూప చెప్పారు. తాను ఇచ్చిన నివేదికలోని విషయాలు తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేయాలని ఆమె సూచించారు.