శరవేగంగా మైండ్ స్పేస్ ఫ్లైఓవ‌ర్‌ ప‌నులు

స్ట్రాట‌జిక్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మాదాపూర్ మైండ్ స్పేస్ జంక్ష‌న్ వ‌ద్ద 103కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఫ్లైఓవ‌ర్‌, అండ‌ర్ పాస్, యుటిలిటి డ‌క్ట్‌తో కూడిన స‌ర్వీస్ రోడ్డు ప‌నులు ‌వేగంగా న‌డుస్తున్నాయి. 48 కోట్ల ఆరు లక్షల వ్య‌యంతో రాడిస‌న్ నుండి దుర్గం చెరువు మార్గంలో ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు, 25 కోట్ల 78 లక్షల  వ్య‌యంతో అండ‌ర్ పాస్ నిర్మాణ ప‌నులు, 28కోట్ల 83 లక్షల వ్య‌యంతో యుటిలిటి డ‌క్ట్ రోడ్‌తో పాటు డ్రెయిన్‌తో కూడిన స‌ర్వీస్ రోడ్ నిర్మాణ ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ప్ర‌స్తుతం మైండ్‌ స్పేస్ మార్గంలో గంట‌కు 14 వేల 393 వాహ‌నాలు వెళ్తున్నాయి. 2035నాటికి ఈ మార్గంలో గంట‌కు 31 వేల 536 వాహ‌నాలు న‌డుస్తాయ‌ని అంచ‌నా. దీంతో పాటు దుర్గం చెరువుపై ఏర్పాటు చేయ‌నున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట ప్రాంతాల‌కు ప్ర‌యాణించేవారికి దూరం తగ్గుతుండటంతో ఈ మార్గంలో గ‌ణ‌నీయంగా ట్రాఫిక్ పెరుగుతుంద‌ని అంచ‌నా వేశారు. ఈ అంచ‌నా ప్ర‌కారం దుర్గంచెరువు బ్రిడ్జి పూర్తి అయిన అనంత‌రం మైండ్‌స్పేస్ మార్గంలో గంట‌కు 46 వేల 390 వాహ‌నాలు ప్ర‌యాణిస్తాయ‌ని అధ్యయ‌నంలో తేలింది. దీంతో మైండ్ స్పేస్ జంక్ష‌న్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాలు పూర్తిస్థాయిలో అభివృద్ది చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మైండ్ స్పేస్ జంక్ష‌న్ ప‌నుల‌న్నింటినీ 2018 జూన్ లోగా పూర్తిచేయాల‌నే ల‌క్ష్యంతో జీహెచ్ఎంసీ ప‌నుల‌ను వేగవంతం చేసింది.

48కోట్ల ఆరు లక్షల  వ్య‌యంతో 830మీట‌ర్ల పొడ‌వునా మైండ్ స్పేస్ వ‌ద్ద ఫ్లై ఓవ‌ర్ నిర్మాణ ప‌నులు జెట్‌ స్పీడ్‌ లో కొనసాగుతున్నాయి. మొత్తం 16.60 మీట‌ర్ల వెడ‌ల్పులో ఉండే ఈ ఫ్లైఓవ‌ర్ రెండు లేన్ల మార్గంలో క్యారేజ్ వే క‌లిగి ఉన్నాయి. 22 పిల్ల‌ర్లు, 420మీట‌ర్ల వ‌య‌డ‌క్ట్‌, 216 మీట‌ర్ల ఆబ్లిగేట‌రిస్పాన్‌లతో ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణం పురోగ‌తిలో ఉంది. ఇప్పటివ‌ర‌కు 9 పిల్ల‌ర్ల పుట్టింగ్ నిర్మాణ ప‌నులు పూర్తికాగా, మ‌రో నాలుగు పిల్ల‌ర్ల నిర్మాణానికి త‌వ్వ‌కాలు పూర్తయ్యాయి. డ్రైనేజీ, యుటిలిటి డ‌క్ట్‌ల నిర్మాణ ప‌నులు స‌మాంత‌రంగా పురోగ‌తిలో ఉన్నాయి. బ‌యోడైవ‌ర్సిటీ పార్కు నుండి సైబ‌ర్ ట‌వ‌ర్స్ వైపు 365మీట‌ర్ల పొడ‌వు గ‌ల అండ‌ర్ పాస్ నిర్మాణాన్ని  25 కోట్ల78 లక్షల వ్య‌యంతో చేప‌ట్టారు. ఈ అండ‌ర్‌పాస్‌కు 83మీట‌ర్ల పొడవునా క్లోజ్‌ డ్ బాక్స్ ఉండ‌గా 182మీట‌ర్ల అప్రోచ్ పొడ‌వుతో మొత్తం 28.80 మీట‌ర్లతో ఆరు లైన్ల‌ వెడ‌ల్పు క‌లిగి ఉంది. కాగా ఈ అండ‌ర్ పాస్ నిర్మాణంలో మొత్తం 365 మీట‌ర్ల‌గాను 147మీట‌ర్ల పొడ‌వున ప‌నులు పూర్తయ్యాయి. 83మీట‌ర్ల క్లోజ్‌ డ్ బాక్స్‌కు గాను 53మీట‌ర్ల పొడ‌వున త‌వ్వ‌కాలు పూర్తి అయ్యాయి. ర‌హేజా మార్గం వైపు 135మీట‌ర్ల త‌వ్వ‌కాలు జ‌ర‌పాల్సి ఉండ‌గా 80మీట‌ర్ల పొడ‌వున త‌వ్వ‌కాలు పూర్తి అయ్యాయి. ఈ అండ‌ర్‌పాస్ నిర్మాణ ప‌నుల‌ను 2017 డిసెంబ‌ర్ లోగా పూర్తిచేయాల‌న్న ల‌క్ష్యంతో జీహెచ్ఎంసీ ప‌నులు చేప‌ట్టింది. 28కోట్ల 83 లక్షల వ్య‌యంతో 2వేల 600మీట‌ర్ల పొడువునా స‌ర్వీస్ రోడ్ల నిర్మాణం చేప‌ట్టగా ఇప్ప‌టి వ‌ర‌కు వెయ్యి 450మీట‌ర్ల ప‌నులు పూర్త‌య్యాయి.

ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులను మంత్రి కేటీఆర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అటు తరుచుగా సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశం జరగడం వ‌ల్లే ఎస్‌ఆర్‌డీపీ ప‌నులు వేగ‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌ జనార్థ‌న్‌రెడ్డి తెలిపారు.