వైభవంగా ఉజ్జయిని మహకాళి బోనాలు 

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వేడుకలు అత్యంత వైభోవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో ఆనవాయితీగా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి కూడా  ఘనంగా అంకురార్పణ జరిగింది. తొలిపొద్దున అమ్మవారి జాతర వైభవంగా మొదలైంది. డప్పుచప్పుళ్లు,. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జై మహంకాళమ్మ నినాదాలు మార్మోగుతుండగా.. ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివెరిసింది.

వేకువజామున 4 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌  దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. ఆలయ నిర్వహకులు కాళీమాతకు తొలిపూజ నిర్వహించారు.

బోనాల వేడుకల్లో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఎంపీ కవిత .. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. కవితతో పాటు ముఖ్యమంత్రి సతీమణి శోభ … అమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. మంత్రి పద్మారావు, పీవీ సింధు కూడా  ఈ  ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి దయతో అందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కవిత ఆకాంక్షించారు.

అటు గవర్నర్ నరసింహన్ దంపతులు ఉజ్జయినీ మహంకాళిని దర్శించుకున్నారు.అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అందరికీ ఇష్టమైన బోనాలను ఆనందోత్సాహల మధ్య జరుపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

ఉదయం నుంచి నిర్విరామంగా భక్తులు అమ్మవారికి దర్శనం చేసుకున్నారు. శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు .. ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అందరూ చల్లగా ఉండాలని మహంకాళి అమ్మవారిని ప్రార్థించారు.

లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల ఉత్సవాల్లో మహిళలు, చిన్నారులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి.. మొక్కులు చెల్లించారు. పిల్లాపాపల్ని చల్లగా చూడమంటూ అమ్మవారిని వేడుకున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

బోనాల ఉత్సవాల్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అందుకే ఏర్పాట్లపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సోమవారంతో ఈ  బోనాల వేడుకలు ముగియనున్నాయి. రంగం కార్యక్రమంతో ఈ సంబురం పూర్తి కానుంది. ఈ తుదిఘట్టాన్ని కూడా అంతే వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.