వీనస్ రికార్డు సృష్టించేనా?

వయసు పెరిగినా వన్నె తరుగని ఆటతో అలరిస్తున్న అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ ఇప్పుడు రికార్డు టైటిల్‌పై గురిపెట్టింది. ఎనిమిదేండ్ల తర్వాత తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన 37ఏండ్ల వీనస్ ఇవాళ జరిగే టైటిల్‌పోరులో స్పెయిన్ స్టార్ గార్బినె ముగురుజాతో అమీతుమీ తేల్చుకోనుంది. చివరి మేజర్ టైటిల్‌ను ఇదే వేదికపై అందుకున్న వీనస్ ఫైనల్లో గనుక గెలిస్తే అత్యధిక వయసులో గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనుంది. అంతేకాదు, ఆమెకిది ఆరో వింబుల్డన్ టైటిల్ అవుతుంది. అయితే, రెండేండ్ల క్రితం ఇక్కడ రన్నరప్‌గా నిలిచిన 23ఏండ్ల ముగురుజాను తక్కువ అంచనా వేయలేం. ఈ సీజన్‌లో అద్భుతఫామ్‌తో రాణిస్తున్న ముగురుజా గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌తో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది. ఇక ముగురుజాతో ముఖాముఖి రికార్డులో వీనస్ 3-1తో ముందంజలో ఉంది. కాగా, చివరిసారిగా ఈ ఏడాది రోమ్ మాస్టర్స్‌లో వీనస్‌పై నెగ్గడం ముగురుజాకు కలిసొచ్చే అంశం. మరి.. ఈసారి ముగురుజా జోరుకు అడ్డుకట్ట వేసి వీనస్ రికార్డు టైటిల్ అందుకుంటుందో లేదో చూడాలి.